Idream media
Idream media
ప్రతి రాజకీయ పార్టీ ఏర్పాటు వెనుక ఓ సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం ఆధారంగా తాము రాజకీయాలు చేస్తామని ఆ పార్టీని ఏర్పాటు చేసిన నేతలు చెబుతుంటారు. కాల చక్రంలో ఈ సిద్ధాంతాలు, విధానాలు సమయం, సందర్భాన్ని బట్టీ మారుతూ ఉంటాయి. అలా మార్చుకోవడానికి గల కారణాలను కూడా వారు ప్రజలకు వివరిస్తారు. ఆయా పార్టీలను ప్రజలు ఆదరిస్తారా..? లేదా..? అనేది ఎన్నికల్లో తేలుతుంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ, ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు జమానా ప్రారంభమైన తర్వాత టీడీపీ తన సిద్ధాంతాన్ని, విధానాన్ని ఏన్నో సార్లు మార్చుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోనే చేతులు కలిపింది.
కొన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే రాజకీయ నేతలు కూడా తమ విధానాలను, సిద్ధాంతాలను పక్కనపెట్టి అధికారమే పరమావధిగా పార్టీలు మారుతుంటారు. దానికి అనుగుణంగా తమ వైఖరిని కూడా మార్చుకుంటారు. భారతీయ రాజకీయాల్లో ఈ మార్పు ప్రజలను కూడా అంగికరించారని ఒక నాయకుడు పలు పార్టీల ద్వారా ఎన్నికల్లో గెలవడం ద్వారా తెలుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి ఊరికే పుట్టుకు రాలేదు.
మొత్తం ఈ ఉపోద్ఘాతం ఇప్పుడు చెప్పడానికి గల కారణం బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఈ రోజు ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్. ప్రధాని మోదీ ఏపీకి చేస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రమేష్ బీజేపీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఏపీకి మేలు జరగాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఆవశ్యకమన్నారు. కుటుంబ పాలన చేసే పార్టీలు కాకుండా ప్రజల క్షేమాన్ని కోరే పార్టీలను గెలిపించాలని సీఎం రమేష్ కోరారు.
పైన పేర్కొన్నట్లుగా సీఎం రమేష్ స్టేట్‌మెంట్‌ను ఏ మాత్రం తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కానీ చర్చించుకోవడం అవసరం. రమేష్ స్టేట్‌మెంట్‌లో ముఖ్యమైన విషయం.. కుటుంబ పాలన కాకుండా ప్రజల క్షేమాన్ని కోరే పార్టీలను గెలిపించాలని చెప్పడం. ఈ విషయం చెప్పే ముందు సీఎం రమేష్ తన రాజకీయ ప్రస్థానం, ఉన్నతి ఏ పార్టీలో జరిగిందో, ఆ పార్టీ ఎలాంటిదో అన్న విషయం మరచిపోయారా..? లేక చరిత్రతో పనేముంది వర్తమానమే ముఖ్యమనుకున్నారో గానీ స్టేట్‌మెంట్ అయితే ఇచ్చేశారు.
1999లో రిత్విక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ పెట్టిన సీఎం రమేష్ కాంట్రాక్టర్‌గా అవతారమెత్తారు. టీడీపీ రాజకీయ నాయకుడిగా మారారు. ఆ పార్టీ తరఫున 2012లో రాజ్యసభకు నామినేటెడ్ అయ్యారు. సీఎం రమేష్ సేవలను గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు రమేష్‌ను 2018లో రెండో సారి కూడా రాజ్యసభకు పంపారు. రాజకీయ జీవితంలో ఏనాడు కూడా సీఎం రమేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన దాఖలాలు లేవు. రేపు బీజేపీ తరఫున కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా..? అంటే చేయరని ఖరాఖండిగా చెప్పవచ్చు.
మరి టీడీపీ పార్టీ రాష్ట్రంలో పలుమార్లు అధికారంలో ఉంది. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకూ పాలన సాగించారు. చంద్రబాబు పాలనలోనే పార్టీ కోసం పని చేసిన వర్ల రామయ్య వంటి వారిని కాదని సీఎం రమేష్ లాంటి వారికి రాజ్యసభ సీటు వచ్చిందంటే కుటుంబ పాలన కావడం వల్లనే సాధ్యమైందని చెప్పవచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ఆయన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. ఏ అర్హత ఉందని నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చారంటూ కూడా విమర్శలొచ్చాయి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్నారేమో సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీ నేతగా కుటుంబ పాలన వద్దంటున్నారు. మరి భవిష్యత్‌లో సీఎం రమేష్ ప్రజల క్షేమాన్ని కోరే బీజేపీలో ఉంటారా..? లేదా కుటుంబపాలన సాగించిన పార్టీకే తిరిగి వస్తారా..? వేచి చూడాలి.