ఆపరేషన్‌ కమల్‌.. అంతా గప్‌చుప్‌..!

ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో జనసేనతో కలసి అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడైన తర్వాత ఆ పార్టీ పని తీరు పూర్తిగా మారిపోయింది. ఏపీలో ఆది నుంచి టీడీపీకి బి పార్టీలానే బీజేపీ ఉంది. ఈ పరిస్థితిని మార్చే ప్రయత్నం ఇప్పటికే మొదలైంది. టీడీపీ స్థానంలోకి రావాలని బీజేపీ నేతలు లక్ష్యాలు పెట్టుకున్నారు. పార్టీ పెద్దల లక్ష్యానికి అనుగుణంగానే సోము వీర్రాజు రాజకీయం చేస్తున్నారు. అయితే పార్టీలో నేతల చేరికలు మాత్రం ఆశించినంతగా లేకపోవడం కమల దళాన్ని నిరాశకు గురి చేస్తోంది. తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో పోలిక ఉంటుండడంతో సోము వీర్రాజుపై సాధారణంగానే ఒత్తిడి పడుతోంది.

నేతల కోసం కమిటీ..

తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా బీజేపీ బలోపేతం కావాలంటే.. బలమైన, క్యాడర్‌ ఉన్న నేతలను ఆకర్షించాలి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు సోము వీర్రాజు తన వంతు ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల పర్యటించారు. ఇతర పార్టీలలో ఉంటూ స్తబ్దుగా ఉన్న నేతలను బీజేపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. అవి కొంత వరకు మాత్రమే ఫలించాయి. టీడీపీ స్థానంలోకి రావాలనుకుంటున్న బీజేపీ.. 2019 ఎన్నికల తర్వాత ఆ పార్టీలో నెలకొన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలకు గాలం వేస్తోంది. అయితే బీజేపీ ప్రయత్నాలకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ గండికొడుతున్నారు. ఆ పార్టీలో చేరే ముందు ఆలోచించుకోవాలని పలు సూచనలు చేయడంతో బీజేపీలో చేరికలపై ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితిని అధిగమిస్తూ, ఇతర పార్టీలలోని నేతలను బీజేపీలోకి తీసుకువచ్చేలా కమలం పార్టీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

అంతా సీక్రెట్‌.. లక్ష్యం నెరవేరుతుందా..?

బీజేపీలోకి ఇతర పార్టీల నాయకులను తీసుకురావడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించేందుకు వీలుగా కమిటీని ఏర్పాటు చేసిన కమలం పార్టీ.. పక్కా ప్లాన్‌తో ముందుకు వెళుతోంది. తమ ప్రయత్నాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు సదరు కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారనేది గోప్యంగా ఉంచింది. బీజేపీ ప్రయత్నాలు ఫలిస్తే.. అది టీడీపీకే ఎక్కువ నష్టం చేస్తుంది. అందుకే టీడీపీ నేతలు బీజేపీ ప్రయత్నాలను అడ్డుకునేందుకు యత్నిస్తారనడంలో సందేహం లేదు. గంటా శ్రీనివాసరావు సహా పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరతారనే ప్రచారం సాగినా.. అవి కార్యరూపం దాల్చకపోవడానికి కారణం పసుపు పార్టీ అప్రమత్తం కావడమేనని కమలం పార్టీ నేతలు నిర్థారణకు వచ్చారు. అందుకే ఆపరేషన్‌ కమల్‌ను రహస్యంగా చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్లుగా ఉంది. ఇంతకు ముందులాగా ఎవరెవరు పార్టీలో చేరుతున్నారు..? ఎవరిని చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామనే విషయం బయటకు తెలియకుండా కమలం పార్టీ జాగ్రత్త పడుతోంది. మరి రహస్య కమిటీ ఏర్పాటు ద్వారా ఇతర పార్టీలలోని నేతలను చేర్చుకోవాలనే కమలం పార్టీ లక్ష్యాలు నెరవేరతాయా..? లేదా..? కాలమే తేల్చాలి.

Show comments