iDreamPost
android-app
ios-app

బీజేపీ – జనసేన.. తిరుపతిలో పోటీపై క్లారిటీ

బీజేపీ – జనసేన.. తిరుపతిలో పోటీపై క్లారిటీ

x aతిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోటీపై బీజేపీ–జనసేన పార్టీలు ఓ అభిప్రాయానికి వచ్చాయి. తిరుపతి లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేసేందుకు ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. జనసేన మద్ధతుతో బీజేపీ తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ వ్యవహారాల ఇంఛార్జి మురళీధర్‌ రావు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్‌లో ఈ విషయం వెల్లడించారు. ఏపీలో బీజేపీ విజయ యాత్ర తిరుపతి నుంచి ప్రారంభమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తిరుపతిలో పోటీ విషయమై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ ఏపీ వ్యవహారాల సహ ఇంచార్జి సునిల్‌ దియోధర్‌ కూడా ట్వీట్‌ చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌లతో చర్చించిన తర్వాత అందరూ కలసి తిరుపతిలో పోటీ చేయడంపై నిర్ణయం తీసుకున్నామని బీజేపీ నేతలు వెల్లడించారు. అయితే తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిపై బీజేపీతో చర్చించిన విషయం, తీసుకున్న నిర్ణయంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గానీ, నాందెండ్ల మనోహర్‌ గానీ ప్రకటించలేదు.

ఆది నుంచి తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలన్న అంశంపై ఇరు పార్టీల మధ్య అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తమ పార్టీ అభ్యర్థే పోటీ చేస్తారని బీజేపీ నేతలు, లేదు జనసేన అభ్యర్థే పోటీలో ఉంటారని జనసేన నేతలు ఎవరికి వారు ప్రకటనలు జారీ చేసిన సందర్భాలున్నాయి. బీజేపీ అభ్యర్థే పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటన చేయడంపై జనసేన వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. తమతో సంప్రదించకుండానే ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని అలకబూనాయి. ఇరు పార్టీల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలు కొన్ని రోజులుకు సద్దుమణిగాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్ధతు ఇచ్చినందున తిరుపతి లోక్‌సభ సీటు తమకు వదిలేయాలని కూడా జనసేన బీజేపీ ముందు ప్రతిపాదనలు పెట్టింది. అయితే ఇవన్నీ పోయి.. చివరకు బీజేపీ అభ్యర్థే బరిలో నిలవబోతున్నారు.

Also Read : ఉక్కును మంచిగానే ప్రైవేటీక‌రిస్తార‌ట‌!

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కరోనా కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బల్లి దుర్గాప్రసాదరావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. బల్లి దుర్గా ప్రసాదరావు కుటుంబ సభ్యులు పోటీపై ఆసక్తి చూపకపోవడంతో ఈ ఎన్నికల్లో వైసీపీ తన అభ్యర్థిగా డాక్టర్‌ గురుమూర్తిని ప్రకటించింది. బల్లి దుర్గాప్రసాద్‌రావు కుమారుడు బల్లి కల్యాణ్‌ చక్రవర్తిని శాసన సభ్యుల కోటాలో ఇటీవల ఎమ్మెల్సీని చేసింది. టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అందరికన్నా ముందుగా ప్రకటించారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో జరగాల్సిన ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గత నెలలో షెడ్యూల్‌ను ప్రకటించింది. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయో ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. తిరుపతి లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే తేదీలు ప్రకటిస్తామని వెల్లడించింది.