Idream media
Idream media
రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. అందుకే రాజకీయాల్లో సాధ్యం కానిది ఏదీ లేదంటారు. ఈ క్రమంలోనే అంతుచిక్కని అంశాలు చాలా ఉంటాయి. అలాంటి అంతుచిక్కని అంశాలలో ప్రస్తుతం బీజేపీ, జనసేన పార్టీల మధ్య ఉన్న పొత్తు కూడా ఒకటి. 2019 సాధారణ ఎన్నికలలో వేర్వేరుగా పోటీ చేసిన బీజేపీ, జనసేన పార్టీలు.. ఎన్నికలు ముగిసిన తర్వాత కొద్ది నెలలకే పొత్తు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత పొత్తు వల్ల ప్రయోజనం ఏమిటన్నవారికి.. 2024 ఎన్నికలను ఆ పార్టీల నేతలు చూపించారు. అప్పటి వరకూ ప్రజా సమస్యలపై కలసి కార్యక్రమాలు, నిరసనలు నిర్వహిస్తామని చెప్పారు.
అయితే ఆ పార్టీల నేతలు చెప్పినదానికి భిన్నంగా వాస్తవ పరిస్థితి ఉంది. ఉమ్మడి కార్యక్రమాలే కాదు.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన, జరగబోతున్న స్థానిక, ఉప ఎన్నికల్లో ఆ పార్టీలు కలసి పోటీ చేయడం లేదు. కానీ ఏపీలో మాత్రం 2024లో బీజేపీ, జనసేన పార్టీలు కలసి అధికారంలోకి వస్తాయనే ప్రకటన ఇరు పార్టీల వైపు నుంచి ఇప్పటికీ వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో జనసేనతో కలసి ఏపీలో అధికారంలోకి వస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా చెప్పారు. అదే సమయంలో విజయవాడలో జనసేన సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేత నాదెండ్ల మనోహర్.. ఏపీలో బీజేపీతో కలిసే జెండా ఎగురవేసేలా భవిష్యత్ కార్యచరణ ఉంటుందని ప్రకటించారు.
తాజాగా జరిగిన దుబ్బాక ఎన్నికల్లో జనసేన, బీజేపీలు కలసి పోటీ చేయలేదు. ప్రస్తుతం జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇక ఏపీలో వాయిదా పడిన ఎన్నికల్లో కూడా నేతలు పొత్తు ఉంటుందని చెప్పినా.. క్షేత్రస్థాయిలో అది కనిపించలేదు. నామినేషన్లలో ఇది స్పష్టమైది. జనసేన, బీజేపీలు ఒకే స్థానంలో నామినేషన్లు దాఖలు చేశాయి. ఓ వైపు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. ఆ రెండు పార్టీల నేతలు మాత్రం ఎప్పుడో మూడున్నరేళ్ల తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచి ప్రకటనలు గుప్పిస్తూ పొంతన రాజకీయాలు చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
2014 ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. బీజేపీతో పొత్తు ఏపీ వరకేనని, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని టీడీపీ నేతలు ప్రకటించారు. అందుకు సమాధానంగా.. బీజేపీ నాటి నేత, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో సహా పలువురు బీజేపీ నేతలు.. సగం పెళ్లి ఉండదంటూ వ్యాఖ్యానించారు. పొత్తు ఉంటే.. రెండు రాష్ట్రాలోనూ ఉంటుందని స్పష్టం చేశారు. దానికి తగినట్లుగానే.. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలు రెండు రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాయి. 2014 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఉమ్మడిగానే పోటీ చేశాయి.
మరి ఈ సగం పెళ్లి సూత్రం.. ప్రస్తుతం జనసేనకు వర్తింపజేసే ప్రయత్నం బీజేపీ నేతలు చేయడం లేదన్నది తాజా పరిణామాలతో అర్థం అవుతోంది. జనసేనతో పొత్తు ఏపీ వరకేనా.. అనే సందేహం కూడా ఆ రెండు పార్టీల శ్రేణుల్లో కలుగుతోంది. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీపైనే ఉంది.