iDreamPost
iDreamPost
మాములుగా గ్లామరస్ పాత్రలు వేసే హీరోయిన్లకు ఛాలెంజింగ్ అనిపించే పాత్రలు దక్కడం చాలా అరుదు. ఏదో హీరో పక్కన నటించామా, నాలుగు డ్యూయెట్లలో డాన్సులు చేశామా, రెమ్యునరేషన్లు తీసుకున్నామా అన్నట్టుగానే ఉంటుంది ఎక్కువ శాతం వ్యవహారం. అందుకే విజయశాంతికి దక్కినన్ని అద్భుతమైన పాత్రలు అంతే స్టార్ డం అనుభవించిన రాధను వరించలేదు. ఎందుకంటే దానికి కారణాలు బోలెడు. కానీ కెరీర్ ప్రారంభమే ఒక సవాల్ గా మారి మనుగడే ప్రశ్నగా మారిన సమయంలో దానికి ఎదురీది కెరీర్ లో నవరసాలు పలికించే క్యారెక్టర్లు దక్కించుకుని యాభై ఏళ్ళ వయసులోనూ వెలిగిపోతున్న నటి రమ్యకృష్ణ
1970 సెప్టెంబర్ 15 పుట్టిన రమ్యకృష్ణ ప్రముఖ తమిళ నటుడు మాజీ ఎంపి చొ రామస్వామికి మేనకోడలు వరసవుతుంది. 14 ఏళ్ళ వయసులో 1984లో ‘వెల్లయ్ మనసు’తో డెబ్యూ చేసిన రమ్యకృష్ణ తెలుగులో 1986లో ‘భలే మిత్రులు’తో ఎంట్రీ ఇచ్చింది. ఆశించినంత గొప్పగా తొలి ఫలితాలు దక్కలేదు. ‘చక్రవర్తి’లో చిరంజీవికి చెల్లెలిగా నటించడం ప్లస్ కాలేకపోయింది. నాగార్జున సంకీర్తన, రాజేంద్రప్రసాద్ తో చేసిన రెండు మూడు సినిమాలు ఏవీ పెద్దగా ఆడలేదు. 1989లో కె విశ్వనాథ్ గారి ‘సూత్రధారులు’తో ఆవిడలో అసలైన నటి ప్రపంచానికి పరిచయమయ్యారు. తర్వాతి సంవత్సరం ‘అల్లుడుగారు’లో చేసినది చిన్న పాత్రే అయినా చాలా పేరు తీసుకొచ్చింది.
1992లో ‘అల్లరి మొగుడు’ రూపంలో పెద్ద హిట్టు దక్కగా 1993లో అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, బంగారు బుల్లోడు ఇలా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు దక్కాయి. వీటిలో మొదటి మూడు దర్శకేంద్రులవే కావడం గమనార్హం. 1994లో ముగ్గురు మొనగాళ్లు, ముద్దుల ప్రియుడు, హలో బ్రదర్, అల్లరి ప్రేమికుడు ఇలా ఏ సినిమా చూసినా దర్శకులకు స్టార్ హీరోలకు తనే బెస్ట్ ఛాయస్ అనిపించేది. 1995లో ‘ఆయనకు ఇద్దరు’లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో జీవించిన తీరు నభూతో నభవిష్యత్. అదే ఏడాది ‘అమ్మోరు’లో తనలో మరో కోణాన్ని ఆవిష్కరించారు రమ్యకృష్ణ. 1997 ఆహ్వానం, అన్నమయ్య 1998 ఊయల మరొకొన్ని చెప్పుకోదగ్గ ఆణిముత్యాలు
1999లో రజనీకాంత్ ను డామినేట్ చేసినంత పని చేసిన ‘నరసింహా’ రమ్యకృష్ణ ప్రస్థానంలో అతి గొప్ప మైలురాయి. విలన్ షేడ్స్ లో నీలాంబరిగా ఆవిడ పెర్ఫార్మన్స్ ని మ్యాచ్ చేసినవాళ్లు మళ్ళీ ఎవరూ కనిపించలేదు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న తరుణంలో తనలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి 2000లో ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’తో పునాది వేశారు. 2005లో జూనియర్ ఎన్టీఆర్ కు అత్తగా ‘నా అల్లుడు’లో కనిపించారు. ఇక 2015లో వచ్చిన ‘బాహుబలి’ శివగామి గురించి చెప్పాలంటే పుస్తకమే అవుతుంది. కొత్త జనరేషన్ తోనూ పోటీ పడి ఎన్నో ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రమ్యకృష్ణలో ఇవాళ్టికి ముదిమి ఛాయలు తక్కువగా కనిపించడానికి కారణం నటతృష్ణే
Also Read : రాక్షసుడు – 35 ఏళ్ళ క్రితమే వచ్చిన మెగా రాఖీభాయ్ – Nostalgia