Idream media
Idream media
దర్శకులు కొత్తగా ఆలోచించడం మానేసి , ఉన్న సినిమాల్లోంచి ఒక్కో సీన్ తెచ్చుకుని ఎలాగో పాసై పోతే చాలనుకుంటున్నారు. దీనికి ఉదాహరణే భీష్మ. ఫార్ములాని బట్టీ పట్టేసి బయటపడుతున్న బాపతులోకి ఇది కూడా వస్తుంది.
హీరోకి అన్ని అనుకూలంగా జరగడం, ఎలాంటి ఘర్షణ లేకుండా రెండు ఫైట్లతో కార్పోరేట్ వార్స్‌ని కూడా సాల్వ్ చేయడం భీష్మ సినిమా స్పెషాలిటీ. హఠాత్తుగా ఒక విచిత్రమైన సిట్యుయేషన్ జరగడం, దాన్నుంచి హీరో ఎలా గెలుస్తాడు అనేది పాతజోనర్.
జార్జ్‌బార్ అనేవాడికి 1902లో ఒక ఐడియా వచ్చింది. ఒకడికి ఏడు మిలియన్ డాలర్ల డబ్బు వచ్చి , దాన్ని ఒకే సంవత్సరంలోగా ఖర్చు చేయాల్సి వస్తే ఏం జరుగుతుంది? దానధర్మాలు చేయకూడదు అదీ షరతు. బ్రిస్టర్స్ మిలియన్స్ అని ఒక నవల రాసి పడేశాడు. 1906లో దాన్ని నాటకంగా బ్రాడ్‌వేలో ప్రదర్శించారు. అన్ని షోలు హౌస్‌ఫుల్. ఈ కథను 13 సార్లు సినిమాగా తీశారు. 1954లో వద్దంటే డబ్బు అని ఎన్టీఆర్‌తో తీస్తే అది పెద్దగా ఆడలేదు. 1985లో జంద్యాల బాబాయ్ అబ్బాయ్ అని తీశాడు. 1988లో హిందీలో ‘మాలా మాల్’ , 97లో రజనీకాంత్‌తో అరుణాచలం ఇదే కథ.
దీన్ని కొంచెం రివర్స్ చేస్తే చిరంజీవి ‘చాలెంజ్’. చేతిలో చిల్లిగవ్వ లేకుండా లక్షలు సంపాదించడం. ఈ కథలతో సంబంధం లేదు కానీ, భీష్మ కూడా కొంచెం ఈ ఫార్ములానే. హీరో హఠాత్తుగా ఒక కంపెనీకి CEO అవుతాడు. 30 రోజుల్లో తన ప్రతిభ నిరూపించుకోవాలి, లేదంటే దిగిపోతాడు. ఏం చేశాడన్నది సినిమా. నిజానికి నితిన్ ఏమీ చేయడు. రెండు ఫైట్స్ చేసి, రెండు ఉపన్యాసాలు ఇస్తాడు. దర్శకుడికి అంతకు మించి తెలియదు, ప్రేక్షకులకి అంతకంటే అవసరం లేదు కాబట్టి భీష్మ ఒడ్డున పడ్డాడు.
కథ నేరుగా కాకుండా పల్టీలు కొడుతూ వెళుతూ ఉంటుంది. కాసేపు హీరో లవ్, హీరోకి సంపత్‌కి మధ్య గొడవ, ఆర్గానిక్ పంటలపై ఉపన్యాసాలు, ఫర్టిలైజర్స్ కంపెనీ యజమాని విలనిజం, రైతుల గోల అన్నీ మిక్స్ చేసేశారు.
నితిన్, వెన్నెల కిషోర్ కామెడీ, కొన్ని యాక్షిన్ సన్నివేశాలు సినిమాని రక్షించాయి. సినిమా బిగినింగ్ బోర్. భీష్మ కంపెనీ వారసుడు అన్నప్పుడు కొంచెం పైకి లేస్తుంది. సెకండాఫ్‌లో కథ లేకపోవడం వల్లే తాతల కాలంనాటి టన్నెల్ కామెడీ Add అయ్యింది.
శ్రీమంతుడు , మహర్షి తర్వాత ఇప్పుడు రైతుల సమస్యలు టచ్ చేయడం ఒక ఫార్ములా. నిజానికి ఆర్గానిక్ వ్యవసాయానికి, ఫర్టిలైజర్ కంపెనీలకి మధ్య ఎప్పుడూ వార్ లేదు. దేనిదారి దానిదే. సేంద్రీయ వ్యవసాయం ఒక బ్రాండెడ్ నేమ్ స్థాయికి రాలేదు. ఎందుకంటే దాని ఉత్పత్తులు ఖరీదు ఎక్కువనే అభిప్రాయం జనంలో ఉంది. అందుకే ఆర్గానిక్ షాప్స్‌లోకి సామాన్యులెవరూ వెళ్లరు. అందుబాటులో లేకపోవడం వల్ల పేద ప్రజలెవరూ సేంద్రీయ కూరగాయల్ని తినే పరిస్థితి లేదు. సినిమాలో మాత్రం అదేదో ప్రజలు , రైతుల సమస్యగా చూపించారు.
సరే పురుగుల మందు వాడటం మంచిది కాదు అనే సందేశం మెచ్చుకోతగిందే. అది ఒక ఉద్యమ స్థాయిలో రావాలంటే ప్రభుత్వమే రైతులకి అండగా నిలబడాలి. ఆ పని ప్రభుత్వాలు ఎప్పుడూ చేయవు. ఎందుకంటే కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అంటే మిలియన్ డాలర్ల బిజినెస్. అనంత్‌నాగ్ చాలా కాలం తర్వాత కనిపించాడు. విలన్‌గా చేసినా జిఘసేన్‌గుప్త చూడటానికి బాగున్నాడు. నటించడానికి స్కోప్‌లేదు.
దర్శకుడు వెంకీ కుడుముల , కామెడీ టోన్‌ని మిస్ కాకుండా చూసుకున్నాడు. సింపుల్ కామెడీ నితిన్ మీద వర్కవుట్ అయ్యింది. పడిపడి నవ్వేంత కాకపోయినా, సినిమా పడిపోకుండా నడిచిపోయింది.
హీరోయిన్ చాలా తెలివైన అమ్మాయిలా కనిపిస్తుంది కానీ హీరో ఏదో మాట్లాడితే, ఫోన్‌లో అది విని, ఏకవాక్యానికే ఇంప్రెస్ అయిపోతుంది. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లకి తెలివి ఉంటే ప్రమాదమని మన దర్శకులు పిక్స్ అయ్యినట్టున్నారు. ఏదో నాలుగు పాటలు, చిన్న అపార్థంతో లాగించేస్తున్నారు.
అతిశయోక్తులతో కూడిన క్యారెక్టర్స్ (సంపత్, వెన్నెల కిషోర్) బ్యాలెన్స్ తప్పితే ఒక్కోసారి కథ మునిగిపోతుంది. భీష్మ మునిగిపోకుండా ఒడ్డుకు చేరుకున్నాడు. స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా ఎలాగో చూసేయవచ్చు.