బీద రవిచంద్ర.. ఏం చెప్పారండీ..!?

కరోనా ఆపత్కాలంలో ప్రజలకు, ప్రభుత్వ సిబ్బందికి తన వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో రక్షణ సామాగ్రి, నిత్యవసర వస్తువులు పంచితే.. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ తనపై కేసు నమోదు చేయడంతోపాటు కార్యక్రమానికి వచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన జిల్లా ఎస్పీ, కలెక్టర్ ల పై వైసీపీ నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని టిడిపి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర తనదైన భాష్యం చెప్పారు. కలెక్టర్ ను విమర్శిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ని విమర్శించినట్లేనని అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్ సివిల్ సర్వీస్ అధికారి కాబట్టి ఆయన్ను విమర్శిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించినట్లే అని కూడా బీద రవిచంద్ర అంటారేమో అని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఘటన వెనుక అసలు కారణాలను విస్మరించి అధికార పార్టీ నేతల మధ్య గొడవలు పెట్టేందుకు బీద తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. బోడి గుండుకు మోకాలికి ముడిపెట్టే పనులు ఫలించవని హితవు పలుకుతున్నారు.

అసలు ఏం జరిగింది..?

గత నెలలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన నియోజకవర్గంలోని వాలంటీర్లు, ప్రభుత్వ సిబ్బందికి రక్షణ సామాగ్రి, నిత్యవసర వస్తువులను పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో వాలంటీర్లు, ప్రభుత్వ సిబ్బంది హాజరయ్యారు. నియోజకవర్గంలోని పలువురు అధికారులు ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు వచ్చారు.

కార్యక్రమం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని, భౌతిక దూరం పాటించలేదంటూ ఆయనతోపాటు మరో ఏడుగురు పై కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులకు నోటీసులు జారీ చేశారు.

ఈ అంశంపై అప్పట్లో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జిల్లా ఎస్పీ కలెక్టర్ తీరును వ్యతిరేకిస్తూ బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఏ ఒక్క అధికారి పై చర్యలు తీసుకున్నా సహించేది లేదని తేల్చిచెప్పారు. అయితే ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది.

తాజాగా అధికారులకు పై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు మరోసారి నోటీసులు జారీ చేశారు. తన ఆహ్వానం మేరకు కార్యక్రమానికి వచ్చిన అధికారులపై అండగా ఉండేందుకు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఏ ఒక్క అధికారి సస్పెండ్ చేసినా తాను సహించబోమని అంటూ వారికి అండగా నిలిచారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ల తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. అధికారులు క్షేత్రస్థాయిలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు భరోసా నిస్తూ సేవలు చేస్తుంటే.. జిల్లా ఎస్పీ, కలెక్టర్లు ఎసి రూముల్లో కూర్చుని సమీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యని ఆధారంగా చేసుకున్న బీద రవిచంద్ర జిల్లా కలెక్టర్, ఎస్పీ ఏసీ రూముల్లో కూర్చున్నారు.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో కూర్చున్నారు.. కాబట్టి.. నల్లపురెడ్డి ముఖ్యమంత్రిని అన్నట్లే అని వక్రభాష్యం చెబుతూ రాజకీయాన్ని పండించాలనుకుంటున్నారు.

Show comments