iDreamPost
android-app
ios-app

స్వచ్ఛమైన శీను పండుల ప్రేమ – Nostalgia

  • Published Mar 30, 2020 | 12:38 PM Updated Updated Mar 30, 2020 | 12:38 PM
స్వచ్ఛమైన శీను పండుల ప్రేమ – Nostalgia

ఇప్పటి సినిమాల్లో ప్రేమంటే కచ్చితంగా లిప్ లాక్ కిస్, లేదా బెడ్ మీద దగ్గరగా ఉన్న క్లోజ్ అప్ షాట్స్ లేనిదే ఏ దర్శకుడూ ఆలోచించలేని పరిస్థితి నెలకొంది. కొందరు దానికి భిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సరైన కథా కథనాలు లేక విజయాలు సాధించలేకపోతున్నారు. కానీ ఇవేవి లేకుండా ప్యూర్ లవ్ అంటే ఎలా ఉంటుందో 1996లోనే చూపించారు కృష్ణవంశీ. నాగార్జున, టబు జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద రూపొందిన ఈ క్లీన్ ఎంటర్ టైనర్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీగా చెప్పుకోవచ్చు. ఇందులో ఈ జంట పేర్లు శీను, పండు(మహాలక్ష్మి).

ఏవియేషన్ కోర్స్ చదవడం కోసం నాన్న స్నేహితుడి ఇంట్లో వసతి కోసం వచ్చిన అమ్మాయి వాళ్ళబ్బాయి ప్రేమలో పడటమే నిన్నే పెళ్లాడతా కథ. కాకపోతే ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కారణంతో చెల్లిని వద్దనుకున్న అన్నయ్యే హీరో తండ్రి. ఆ తర్వాత పగలు, కోపాలు, అలకలు, బుజ్జగింపులు కనువిప్పు ఎక్సెట్రా ఇలా కథ కంచికి చేరుతుందన్న మాట. నిజానికి కథ పరంగా ఎలాంటి గొప్పదనం లేని నిన్నే పెళ్లాడతా ప్రేక్షకులను కట్టిపడేసేలా చేసింది అందులో ఎమోషన్స్. లోతైన భావోద్వేగాలను సున్నితమైన హాస్యాన్ని జోడించి చాలా సహజంగా కృష్ణవంశీ తెరకెక్కించిన తీరు అబ్బురపరిచింది. ఎవరూ లేకుండా ఒక రాత్రి మొత్తం పెద్ద బంగాళాలో శీను పండులు ఇద్దరే ఉండాల్సి వచ్చినా అక్కడ చాలా మెచ్యుర్డ్ రొమాన్స్ చూపిస్తాడు కృష్ణవంశీ.

అసభ్యతకు చోటివ్వకుండా పిల్లలు సైతం ఇబ్బంది పడకుండా నీట్ గా ఉంటుంది ఆ ట్రాక్. ఈ సందర్భంగా వచ్చే కన్నుల్లో నీ రూపమే పాట సందీప్ చౌతా కంపోజింగ్ లో సిరివెన్నెల సాహిత్యంలో కుర్చీలో నుంచి కదలనీయకుండా చేస్తుంది. శీను పండులు అంతగా ప్రేమించుకున్నా ఎక్కడా అతి అనిపించకపోవడమే ఈ కథలోని గొప్పదనం. ప్రతి పాటా ఆణిముత్యమే. రెండు డబ్బున్న కుటుంబాల మధ్య అనుబంధాన్ని నేపధ్యంగా తీసుకున్నా సగటు మధ్యతరగతి వాడు సైతం చక్కగా కనెక్ట్ అయ్యేలా నాగార్జున, టబులు ఆ పాత్రల్లో జీవించిన తీరు నిన్నే పెళ్లాడతాని బ్లాక్ బస్టర్ హిట్ ని చేసింది. అందుకే ఈ జంట ఇప్పటికీ వన్ అఫ్ ది బెస్ట్ ఆన్ స్క్రీన్ లవ్లీ పెయిర్ గా నిలిచిపోయింది.