iDreamPost
iDreamPost
చరిత్ర బూజు దులిపితే మనకు తెలియని సంగతులు,అది కూడా మనచుట్టూ జరిగిన అనేక సంఘటనల వివరాలు బయటకొస్తాయి.
స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా అనేక సంస్థానాలు భారత్ లో కలవలేదని మనకు తెలుసు. సంస్థానాల విలీనం కోసం నెహ్రు ఒక కార్యక్రమాన్ని తీసుకొని వందల సంస్థానాలను చర్చల ద్వారా నిజాం లాంటి వారిని సైన్యం బలంతో విలీనం చేసిన చరిత్ర తెలిసిందే. కానీ \ఆంధ్రప్రదేశ్ లోని ఒక సంస్థానం భారతులో కలవటానికి మొండికేసిన సంగతి చరిత్రలో మరుగున పడింది.
కోవెలకుంట్ల, డోన్, నంద్యాల మధ్య గల 78 గ్రామాలతో బనగానపల్లె ఒక సంస్థానంగా ఉండేది. నవాబులు బ్రిటీష్ వారికి విధేయులుగా ఉంటూ,కప్పం కడుతూ ఈ సంస్థానాన్ని పరిపాలించేవారు. సంస్థానం అంటే పన్నుల నుంచి నేర విచారణ వరకు పూర్తిస్థాయి నిర్ణయాధికారం నవాబుకు ఉండేది.
ఈ సంస్థానాన్ని 1651లో ఆదిల్‌షా స్వాధీనం చేసుకొని సిద్దిం సుబుల్ అనే సేనాని జాగీరుగా చేశారు. 1687లో ఔరంగజేబు బీజాపూర్‌ను ఆక్రమించుకోవడంతో ఇది మొగలుల పాలనలోకి వెళ్ళింది.ఔరంగజేబు మరణం తర్వాత ఈ సంస్థానాన్ని నిజాం రాజులు స్వాధీనం చేసుకున్నారు. సైన్య సహకార పద్దతిలో ఈ ప్రాంతాన్ని నిజాం ఆంగ్లేయులకు “దత్తమండల”గా ఇచ్చేయడంతో 1800 నుంచి నవాబులు ఆంగ్లేయులకు విధేయులుగా ఉంటూ పరిపాలన సాగించేవారు.
బనగానిపల్లె నవాబులలో మంచి పాలన చేసినవారు,ప్రజలను పీడించినవారూ ఉన్నారు. వీరి విలాస వంతమైన జీవితానికి ఆస్తులు కరిగాయి. చివరిదశలో ప్రజలను పీడించటం కూడా పెరిగింది.బనగానపల్లె చివరి నవాబు మీర్ ఫజ్లాలీఖాన్ అరాచక పాలన సాగించాడు.
1939లో మైసూర్ సంస్థానం దివానుగా ఉన్న సర్ మీర్జా ఇస్మాయిల్ కొడుకు హుమయూన్ మీర్జా బనగానపల్లె సంస్థానానికి దివాన్‌గా నియమితులయ్యారు. ఈయన వచ్చిన అనంతరం ఇక్కడ ప్రజలు పడుతున్న బాధలను చూసి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాడు.
నవాబుల కుట్ర పూరిత పనుల వల్ల హుమయూన్‌మీర్జాను కూడా ఆంగ్ల ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ తర్వాత సయ్యద్ ఇమాం దివాన్‌గా వచ్చారు. ఈయన పెత్తందార్లకు కాపు కాస్తూ నవాబుల పరిపాలనను గుర్తుచేశాడు. బనగానపల్లె సంస్థానం వెలుపల ఎకరాకు పావలా నుంచి మూడు రూపాయల వరకు ఉన్న భూమి శిస్తును నాలుగు రూపాయల దాకా వసూలు చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు.
ఇదే సమయంలోనే భీమునిపాటి వెంకటసుబ్బారెడ్డి బనగానపల్లెలో కాంగ్రెస్ పార్టీని స్థాపించాలని నిర్ణయించాడు. గాంధీ అహింసా సిద్దాంతాన్ని, మార్క్స్ ఆర్థిక సూత్రాలను, గోరా నాస్తికవాదాన్ని ఇష్టపడే వ్యక్తిగా ఈయన ఈ ముగ్గురి పేర్ల మొదటి అక్షరాలతో కలుపుకొని తన పేరును “గామాగో” అని మార్చుకున్నారు. ప్రజల కోసం పోరాడాలని వచ్చిన ఈయనకు ఇక్కడి ప్రజల నుంచి సరైన సహకారం లభించలేదు. ఈ నేపథ్యంలో కోవెలకుంట్లలో బనగానపల్లె స్టేటు కాంగ్రెస్‌ను స్థాపించాడు. ఇక్కడి నుంచే కొందరు స్వాతంత్య్ర పిపాసులు ఆయన్ను రహస్యంగా కలుస్తూ ఉద్యమం ప్రారంభమయ్యాక మద్దతు ఇస్తామని చెప్పేవారు. నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాలని ఆయన ప్రజల్లో తిరుగుతూ వారిలో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో ఒక రోజు బనగానపల్లెలోని కొత్తపేటలో కాంగ్రెస్ కార్యాలయం ఏర్పాటుచేసి భారతదేశ జెండాను ఎగురవేయాలని సిద్ధమయ్యాడు. దీంతో ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఉండిపోయారు. నివర్తి వెంకటసుబ్బయ్యను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. 1947 జులైలో జరుగుతున్న ఆ సమావేశంలో ఏం జరుగుతుందోనని బనగానపల్లె నుంచే కాక చుట్టుప్రక్కల నుంచి కొన్ని వేల మంది కొత్తపేట ప్రాంతానికి చేరుకున్నారు. అయితే బనగానపల్లె సంస్థానం దివాన్‌కు ఈ పరిణామాలేవి నచ్చడం లేదు. దీంతో వెంటనే సంస్థానంలో 144 సెక్షను అమలుచేసి పోలీసు బలగాలతో అక్కడికి వచ్చి ప్రజల ఆవేశాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు. దీంతో ఆయన కళ్లముందే జెండా రెపరెపలాడి కాంగ్రెస్ కార్యాలయం ఏర్పాటుచేశారు. అనంతరం నాయకులంతా గ్రామాల్లో పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
1947 ఆగష్టు 15న బనగానపల్లెలో జెండా పాతాలని నిర్ణయించి నివర్తి వెంకటసుబ్బయ్య (శాసనమండలి చైర్మన్ గా పనిచేశారు. సమావేశాలు జరుగుతుండగానే గుండెపోటుతో సభలో చనిపోయారు) అధ్యక్ష్యతన పెద్ద ర్యాలీ తీశారు. పోలీసులు అడ్డగించినా ఆగకుండా సాగుతున్న ర్యాలీని మెజిస్ట్రేటు ఫైర్ ఆర్డర్ రాస్తుండగానే జనసందోహాన్ని చూసి కుప్పకూలిపోయాడు. ఆ ర్యాలీలో ఇళ్లలో ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని సంస్థానంలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యక్రమాలన్నీ స్వామి హంసానంద ఆశ్రమంలో జరిగేవి. ఈ నేపథ్యంలో ఒక రోజు సర్ధార్ వల్లభాయ్ పటేల్ నవాబును ఢిల్లీకి పిలిపించుకొని ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పారు. దీంతో దిక్కుతోచని దివాను తమ జేబుసంస్థను ఒకదాన్ని ప్రజాప్రభుత్వంగా ఏర్పాటుచేసి పరిపాలన కొనసాగించారు. దీంతో ప్రజాందోళనలు మరింత పెరిగిపోయాయి. నవాబు ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ప్రజలు పెద్ద సంఖ్యలో నిరసన వ్యక్తం చేశారు.
చివరకు 1948 ఫిబ్రవరిలో ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ బనగానపల్లె సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ ప్రకటన చేశాడు . ఆ విధంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన ఆరు నెలల తరువాత బనగానపల్లె భారత్‌లో భాగమైంది.
బనగానపల్లె నవాబు వారసులు ఇప్పుడూ ఉన్నారు. వారికి బనగానపల్లె,హైద్రాబాద్ మరియు ఢిల్లీలో కూడా ఆస్తులు ఉన్నాయి. అరుంధతి సినిమా షూటింగ్ జరిగిన బంగ్లా వీరిదే.బనగానిపల్లె -యాగంటి మార్గంలో రోడ్డు పక్కనే చిన్న కొండ మీద ఆ బంగ్లా ఉంది.