iDreamPost
android-app
ios-app

అశ్వద్ధామకు అసలైన పరీక్ష

  • Published Jan 30, 2020 | 5:00 AM Updated Updated Jan 30, 2020 | 5:00 AM
అశ్వద్ధామకు అసలైన పరీక్ష

సంక్రాంతి సినిమాల హడావిడి దాదాపు కొలిక్కి వచ్చినట్టే. రెగ్యులర్ గా థియేటర్లకు వెళ్లే అలవాటున్న ప్రతి ఒక్కరు కుటుంబంతో సహా మహేష్ బన్నీ మూవీస్ తో ఫెస్టివల్ జోష్ తెచ్చేసుకున్నారు. సెలవులు పూర్తయి పది రోజులు అవుతున్నా చాలా చోట్ల అల వైకుంఠపురములో స్టడీగానే ఉండగా వీకెండ్స్ లో సరిలేరు నీకెవ్వరు బాగా రాబట్టుకుంటోంది. రవితేజ డిస్కోరాజా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు అందరి కళ్ళు నాగ శౌర్య అశ్వద్ధామ మీద నిలిచాయి.

విదేశాల్లో స్క్రీన్ ప్లే కోర్స్ చేసిన రమణతేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ తనే కథ రాసి స్వంత బ్యానర్ పై నిర్మించిన నాగ శౌర్య తన మార్కెట్ కి మించిన బడ్జెట్ ని దీనికి ఖర్చు పెట్టించాడని ఇప్పటికే టాక్ ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు సుమారు 15 కోట్లు నిర్మాణానికి అయ్యిందట. ఇది బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే తప్ప అంత మొత్తం షేర్ రూపంలో వెనక్కు రాలేదు. కానీ బిజినెస్ డీల్స్ రీజనబుల్ రేట్లకే ఇచ్చినట్టుగా తెలిసింది. నాగ శౌర్యకు ఛలో తర్వాత హిట్ లేదు. కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల హ్యాట్రిక్ ఫ్లాపులు అందుకున్నాడు. కణం-అమ్మమ్మగారిల్లు – నర్తనశాల దారుణమైన ఫలితాలు అందుకున్నాయి.

ఓ బేబీ హిట్ అయినా అందులో నాగ శౌర్య ఉన్నాడన్న విషయం చాలా మందికి గుర్తులేదు. అంతగా సమంతా డామినేషన్ సాగింది. ఇదలా ఉంచితే నాగ శౌర్య ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవ్వాలి అంటే అశ్వద్ధామ హిట్టు కొట్టడం చాలా కీలకం. ఎలాగూ బాక్స్ ఆఫీస్ డ్రైగానే ఉంది. వాడుకోవడానికి ఇదే మంచి ఛాన్స్. ఆపై వారం జాను-సవారిలు ఉన్నాయి కాని అవి లవ్ జానర్ కాబట్టి క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన అశ్వద్ధామ హిట్ టాక్ తెచ్చుకుంటే రాక్షసుడు తరహాలో మంచి వసూళ్లు తెచ్చుకోవడం ఖాయం. రేపు తెలుగు పరంగా అశ్వద్ధామకు పోటీ ఉన్నది శివ కందుకూరి హీరోగాగా పరిచయమవుతున్న చూసి చూడంగానే ఒక్కటే. ఈ టైటిల్ ఛలో బ్లాక్ బస్టర్ సాంగ్ పల్లవి కావడం గమనార్హం.