iDreamPost
android-app
ios-app

రాజ్యసభ ఎన్నికలు వాయిదా?

రాజ్యసభ ఎన్నికలు వాయిదా?

ప్రపంచ దేశాలను కబళిస్తోన్న మహమ్మారి కోవిడ్ 19 మనదేశంలోనూ ప్రభావం చూపుతోంది. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు వాయిదా వేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కట్టడి కోసం మార్చి31 వరకు రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ అయ్యాయి. దీంతో రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేయాలని గుజరాత్, రాజస్థాన్ ప్రభుత్వాలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసాయి.

దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 55 రాజ్యసభ స్థానాలకు మార్చి 26న జరగాల్సి ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా ముగియగా.. పలు రాష్ట్రాల్లో ఏకగ్రీవంగానూ రాజ్యసభ సభ్యుల ఎంపిక పూర్తైంది. ఈ 55 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2, 9, 12 తేదీల్లో ముగియనుంది. అయితే ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు రాజ్యసభ స్థానాలకు మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేర్లను సీఎం జగన్ ఖరారుచేసారు. వీళ్లు దాదాపుగా ఎంపిక అయినట్టేనని, తెలంగాణ నుంచి ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, కేసీఆర్ సన్నిహితుడు కేశవరావును ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎంపిక చేసారు. అయితే రాజ్యసభ ఎన్నికల వాయిదాపై మంగళవారం స్పష్టత రావచ్చని అంతా భావిస్తున్నారు. ఈసీ ప్రత్యేక ఆదేశాలు జారీచేయొచ్చని తెలుస్తోంది.