Idream media
Idream media
రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు మధ్య స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న బేధాభిప్రాయాలు చినికిచినికి గాలివానలా మారుతున్నాయి. ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ, కరోనా వల్ల ఇప్పట్లో సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతున్న వేళ.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు.
ఎన్నికల సన్నద్ధతపై బుధవారం జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని నిమ్మగడ్డ కోరగా.. ఎన్నికల నిర్వహణే ఇప్పట్లో కాదంటే.. సమావేశం అవసరం లేదని సీఎస్ ప్రత్యుత్తరం పంపారు. ఈ విషయంపై నిన్న బుధవారం గవర్నర్‌తో భేటీ అయిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. కలెక్టర్లతో సమావేశం నిర్వహించేందుకు మరో ప్రయత్నం చేశారు.
ఈ రోజు కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయాలంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సీఎస్‌కు మరో లేఖ రాశారు. తాను నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌కు అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఈ విషయంపై సీఎస్ నిన్న బుధవారం సవివరంగా లేఖ రాసినా.. మళ్లీ నిమ్మగడ్డ సమావేశం కోసం పట్టుబడుతూ లేఖ రాయడం గమనార్హం. నిమ్మగడ్డ లేఖపై.. మళ్లీ సీఎస్ ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికర అంశం.