iDreamPost
android-app
ios-app

ఈ అడవి నాదే… వేట నాదే… అపోకలిప్టో – Nostalgia

ఈ అడవి నాదే… వేట నాదే… అపోకలిప్టో – Nostalgia

విజయవంతంగా 2020లోకి అడుగుపెట్టాం.. కానీ గత దశాబ్దం 2012 లో భూమి అంతమైపోతుందంటూ వదంతులు వ్యాపించాయి.. ఎలాగూ అంతమైపోతుంది కదా అంటూ కొందరు ఉన్న ఆస్తులను అమ్మేసి బ్రతికినన్ని రోజులు సంతోషంగా గడపడానికి ప్రయత్నించి యుగాంతం రానందుకు రోడ్డున పడ్డారు..ఈ యుగాంతపు వదంతులు రావడానికి ప్రధాన కారణం “మయన్ క్యాలెండర్”. సందట్లో సడెమియా లాగా 2012 యుగాంతం సినిమాలు చేసి నిర్మాతలు డబ్బులు దండుకున్నారు.. అప్పట్లో ఉన్న వదంతులు ఎంతలా వ్యాపించాయి అంటే హాలీవుడ్ సినిమాలకు తెలుగులో పెద్ద మార్కెట్ ఉండేది కాదు,అలాంటిది 2012 యుగాంతం సినిమా తెలుగులో కూడా కొన్ని రోజుల పాటు హౌస్ ఫుల్ కలెక్షన్లతో అదరగొట్టింది.. హాలీవుడ్ సినిమాలకు కూడా బ్లాక్ లో టికెట్లు అమ్మడం 2012 యుగాంతం సినిమాకు జరిగింది…

అసలు యుగాంతం వదంతులకు కారణమయిన “మయన్” నాగరిక సమాజం గురించి ప్రత్యేకంగా సినిమాలు రాలేదు కానీ, “మయన్ నాగరిక” చివరి రోజులను చూపిస్తూ ప్రఖ్యాత దర్శకుడు “మెల్ గిబ్సన్” అపోకలిప్టో(apocalypto)అనే సినిమా రూపొందించాడు.. అపోకలిప్టో సినిమా తెలుగు సినిమా రూపకర్తలకు చాలా సహాయం చేసింది తన సినిమా సీన్లు కాపీ కొట్టుకోవడానికి.. పూర్తిగా కాకున్నా, కొంతవరకూ మయన్ ప్రజల విశ్వాసాలను ఈనాటి ప్రేక్షకుల కళ్ళకు కట్టింది ఈ సినిమా..

అపోకలిప్టో  కథ కూడా మయన్ తెగల మధ్య ఉన్న అంతర్గత దాడులను ఆధారం చేసుకుని రూపొందించారు. జాగ్వార్ పా అనే పాత్ర చుట్టూ అపోకలిప్టో సినిమా నడుస్తుంది. వేరొక పట్టణానికి చెందిన మయన్ గుంపు “జాగ్వార్ పా” ఉంటున్న గ్రామంపై దాడి చేసి వారి గ్రామాన్ని తగలబెట్టి కొందరిని బందీలుగా తీసుకుని తమ పట్టణానికి తీసుకువెళ్తారు. వారి గ్రామ పెద్ద అయిన ఫ్లింట్ స్కై ని చంపేస్తారు.ఆ గ్రామ పెద్ద కుమారుడే ఈ సినిమా కథానాయకుడు. శత్రువుల దాడి జరుగుతున్నప్పుడు నెలలు నిండిన తన భార్యను,కుమారుడిని ఒక గుహ బావిలో దాచి బందీగా దొరుకుతాడు జాగ్వార్ పా. .. బందీలుగా తీసుకెళ్లిన ఆడవారిని తమ పట్టణంలో బానిసలుగా అమ్మి, మగవారిని మాత్రం తమ దైవమైన సూర్యుడికి నరబలి ఇస్తారు..నరబలి కూడా భయంకరంగా బ్రతికున్న వారి ఛాతీ నుండి గుండెను పెకళించి సూర్యుడికి నైవేద్యంగా అర్పిస్తుంటారు.. సరిగ్గా “జాగ్వార్ పా”ను బలి ఇచ్చే సమయానికి సూర్యగ్రహణం సంభవిస్తుంది.

దానితో మిగిలిన బందీలను తప్పించుకుపోవడానికి అనుమతి నిచ్చి ఒకవేళ తమ దాడి నుండి తప్పించుకుని అడవుల్లోకి పారిపోతే ప్రాణాలు నిలుపుకోవచ్చని ఆఫర్ ఇస్తారు.. పారిపోయే క్రమంలో “జాగ్వార్ పా” గాయపడినా, తమపై దాడి చేసిన జీరోవోల్ఫ్ కుమారుడిని హతమార్చి అడవుల్లోకి పారిపోతాడు. కానీ ఇచ్చిన మాట ప్రకారం “జాగ్వార్ పా”ని స్వేచ్ఛగా వదలరు.. తన కుమారుడిని చంపాడన్న పగతో జీరోవోల్ఫ్ తన అనుచరులతో జాగ్వార్ పాని చంపడానికి వెంటాడుతారు.. వారి నుండి జాగ్వార్ పా ఎలా తప్పించుకున్నాడు? జాగ్వార్ పా గుహ బావిలో దాచిన నెలలు నిండిన భార్య సెవెన్, కుమారుడితో సహా బయటపడిందా లేదా అనేది మిగిలిన కథ..

అపోకలిప్టో సినిమాలో మయన్ ప్రజల ఆహార్యం కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. సినిమా మొత్తం మయన్ భాషలోనే సాగుతుంది. ముఖ్యంగా చివరి గంట మొత్తం హీరో తనకున్న ఇబ్బందులను అధిగమిస్తూ పరిగెడుతూనే ఉంటాడు. కొన్ని సన్నివేశాలు రా&రియలిస్టిక్ గా ఉండటంతో సున్నితమైన ప్రేక్షకులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ అప్పటి మయన్ ప్రజల ప్రపంచాన్ని మనకు మరోసారి పరిచయం చేస్తుంది అపోకలిప్టో సినిమా..

సినిమా మొత్తం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతుంది. భాష కూడా సహజంగా ఉండాలని అప్పటి మయన్ భాషలో సినిమాను రూపొందించిన దర్శకుడి సాహసాన్ని మెచ్చుకోవాలి.. ఇందులో వచ్చే యాక్షన్ సన్నివేశాలను, తెలుగు సినిమా రూపకర్తలు తమ సినిమాల్లో కాపీ కొట్టారు.. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన చిరుత సినిమా క్లైమాక్స్ ఫైట్ మొత్తం డైలాగ్స్ తో సహా ఈ సినిమానుండి ప్రేరణ పొందినట్లు స్పష్టంగా తెలుస్తుంది.. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన “పులి” సినిమాలో హీరోకి జన్మనిచ్చే సన్నివేశం ఈ సినిమానుండే ఎత్తుకొచ్చారు. ఇందులో వచ్చే యాక్షన్ సీన్స్ ఏదొక తెలుగు సినిమాలో కనబడుతూనే ఉంటాయి. ముఖ్యంగా యాక్షన్ ప్రియులకు అపోకలిప్టో ఒక “ఐ ఫీస్ట్” గా చెప్పుకోవచ్చు.. మయన్ నాగరికత అంతానికి కారణమయిన స్పానిష్ దండయాత్రలను ఉద్దేశించి స్పానిష్ ఓడలు రావడాన్ని దర్శకుడు తెలివిగా సినిమా చివరలో చూపించడం కొసమెరుపు..