iDreamPost
android-app
ios-app

అన్నన్నా.. అచ్చెన్నా..

అన్నన్నా.. అచ్చెన్నా..

అవినీతి కేసుల్లో ఇరుక్కుని తాను జైలుకు వెళ్లి వచ్చినా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్ష పదవి దక్కడంతో మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడులో ఉత్సాహం ఉరిమినట్లుగా ఉంది. తనకు చంద్రబాబు పదవి ఎందుకు ఇచ్చారో.. అచ్చెం నాయుడు ఈ ఉత్సాహంలో బయటపెట్టేశారు. బీసీలను ఏకం చేసి 2024లో చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తానని అచ్చెంనాయుడు ప్రకటించారు.

అదే సమయంలో బీసీ సామాజికవర్గ ప్రజలకు ఆర్థికంగా, నేతలకు రాజకీయంగా పెద్దపీట వేస్తున్న వైసీపీ ప్రభుత్వంలో విమర్శలు చేస్తున్నారు అచ్చెం నాయుడు. వైసీపీ బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 730 మందికి పదవులు ఇచ్చామని, మంత్రివర్గంలో అత్యధిక మంది బీసీలే ఉన్నారని ఉకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారంటూ పెదవి విరిచే ప్రయత్నం చేస్తున్నారు.

అదే సమయంలో టీడీపీ బీసీలకు పెద్దపీట వేసిందని చెబుతున్నారు. పార్టీ పదవుల్లో 60 శాతం బీసీలకే ఇచ్చారంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వకుండా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ భారం మోయండంటూ పార్టీ పదవులు ఇవ్వడం గొప్ప విషయమా..? లేక ప్రభుత్వంలో మంత్రిపదవులు, నామినేటెడ్‌ పోస్టులు ఇవ్వడం గొప్ప విషయమా..? అనేది అచ్చెం నాయుడుకు పదవి వచ్చిన ఉత్సాహంలో అర్థం కానట్టుగా ఉంది.

బీసీలలో అత్యంత వెనుకబడిన ఉప కులాల వారికి కూడా ప్రభుత్వంలో పదవులు కట్టబెట్టిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని బీసీ సంఘాల నేతలు కొనియాడుతున్నారు. యాచకులు, సంచార జాతుల వారికి కూడా పదవులు ఇచ్చారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే.. బీసీ నేత అయిన అచ్చెం నాయుడు మాత్రం.. చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమంటూ ప్రకటిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీల సామాజిక, ఆర్థిక వృద్ధికి పని చేస్తుంటే.. అచ్చెం నాయుడు మాత్రం బీసీలను ఏకం చేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తానంటున్నారు కానీ బీసీలకు రాజ్యాధికారం కోసం వారిని ఐక్యం చేస్తానని మాత్రం చెప్పడం లేదు.