iDreamPost
android-app
ios-app

నిమ్మగడ్డ నయా భాస్యం.. ఏకగ్రీవాలైతే అధికారుల వైఫల్యమట..!

నిమ్మగడ్డ నయా భాస్యం.. ఏకగ్రీవాలైతే అధికారుల వైఫల్యమట..!

పంచాయతీ ఎన్నికల అంశంపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్ల పేరుతో జిల్లాల్లో పర్యటిస్తూ నిమ్మగడ్డ చేస్తున్న వ్యాఖ్యలకు, టీడీపీ పార్టీ కార్యాలయంలో కూర్చుని చంద్రబాబు మాట్లాడుతున్న మాటలకు పెద్ద వ్యత్యాసం కనిపించడం లేదు. ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదంటూనే.. ఏకగ్రీవాలు మనకు అవసరం లేదని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అధికారులకు చెబుతున్నారు. ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగితే అది అధికారుల వైఫల్యమేనంటూ కొత్త భాస్యం చెబుతున్నారు. నాయకత్వం తీసుకునేందుకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. నామినేషన్లు వేసేందుకు ఆసక్తిగా ఉన్నారంటూ.. రాజకీయ నాయకుడి మాదిరిగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మాట్లాడుతుండడంతో అందరూ ముక్కునవేలేసుకుంటున్నారు.

అందరూ నామినేషన్లు వేయండి, ప్రతి చోట పోట చేయండి. ఏదైనా అవసరమైతే పార్టీని సంప్రదించండి.. అంటూ ఓ పక్క చంద్రబాబు తన పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. రాజకీయ పార్టీకి అధినేత కాబట్టి.. ఎన్నికల్లో పోటీ చేయాలని భావించడం సర్వసాధారణం. పోటీ చేయకుండా ఉంటే అది తప్పువుతుంది. కాబట్టి చంద్రబాబు తీరును ఎవరూ తప్పుబట్టే అవకాశం ఎవరీ లేదు. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పంచాయతీ ఎన్నికలు జరగాలి, ఏకగ్రీవాలు జరిగిన చరిత్ర ఉంటే తప్పా.. కొత్తగా ఏ పంచాయతీ ఏకగ్రీవం కాకుడదనేలా మాట్లాడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న ఓ అధికారి.. ఇలా రాజకీయ నాయకుడు అవతారం ఎత్తడంతో అధికారులు, ప్రజలు అవాక్కవుతున్నారు.

ఐక్యత, సమిష్టి నిర్ణయాల వల్ల సదరు పంచాయతీ అభివృద్ధి పథంలో నడుస్తుందని, ప్రజల మధ్య విభేదాలు రాకూడదని ఏకగ్రీవాలను గత పాలకులు కూడా ప్రొత్సహించారు. అందుకు నగుదు ప్రొత్సాహకం కూడా ఇచ్చారు. ఇదేమీ కొత్తగా వచ్చిన సాంప్రదాయం కాదు. ప్రజలు పార్టీల పరంగా విడిపోకూడదనే.. పంచాయతీ ఎన్నికలను పార్టీ రహిత గుర్తులతో నిర్వహిస్తారు. ఏకగీవ్రం వల్ల కలిగే లభాలు ఏమిటి..? ప్రజలకు, పంచాయతీకి జరిగే మేలు ఏమిటన్నది ప్రభుత్వాలు, మీడియా చైతన్యం కలిగిస్తున్నాయి. చైతన్యవంతులైన ప్రజలు.. సమిష్టి నిర్ణయంతోనే ఏకగీవ్రం వైపు మొగ్గు చూపుతారు. ఇందులో బయట వ్యక్తుల ప్రమేయం శూన్యం. పూర్తిగా సదరు గ్రామ పంచాయతీకి చెందిన వ్యక్తులదే నిర్ణయాధికారం. ఎవరో ఒత్తిడి చేస్తేనో, ప్రలోభాలు పెడితేనో జరిగేవి కావు. కానీ నిమ్మగడ్డ మాత్రం ఎన్నికలు జరిగితే.. విభేదాలు వస్తాయంటూనే ఎన్నికలు జరగాల్సిందేనంటున్నారు. ఎన్నికల వల్ల తలెత్తే విభేదాలు ఆ తర్వాత సమసిపోతాయని సెలవిస్తున్నారు. ఒక సారి విభేదాలు తలెత్తితే అవి పూర్తిగా సమసిపోవడం అంటూ జరగదనేది జగద్వితమే.

పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగాయా..? అంటూ పంచాయతీ ఎన్నికలను జనరల్‌ ఎన్నికలతో పోల్చడం నిమ్మగడ్డకే చెల్లింది. పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకటేనా..? నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఈ తరహాలో ప్రవర్తిస్తుండడం విడ్డూరంగా ఉంది. వాయిదా వేసిన మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్‌ ఎన్నికలను తిరిగి నిర్వహించకుండా.. పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు నిమ్మగడ్డ పడిన తాపత్రాయం వెనుక లక్ష్యం ఏమిటో ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం, ఏకగ్రీవాలు జరగకుండా ప్రతి చోటా పోటీ నెలకొనడం వల్ల గ్రామాల్లో వర్గాలు ఏర్పడతాయి. ఇది ఎవరికి మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిండా మునిగిన వాడికి చలే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పోలింగ్‌ ప్రారంభమైన తర్వాత ఎలా ప్రవర్తిస్తారో వేచి చూడాలి.