iDreamPost
android-app
ios-app

ఇంగ్లీష్ మీడియం అమలుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్

ఇంగ్లీష్ మీడియం అమలుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధన కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 81, 85 లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు అందరికీ ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయించాలనే తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన ఇంగ్లీష్ మీడియం అమలుపై తమ ప్రభుత్వ విధానాన్ని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన అమలు కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని మంత్రి చెప్పారు. హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత న్యాయ విభాగం తో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన ఆవశ్యకతను హైకోర్టుకు తెలియజేశామని మంత్రి చెప్పారు. పేరెంట్స్ కమిటీల తీర్మానాలను హైకోర్టు ముందు ఉంచామని తెలిపారు. ప్రతి మండలంలో ఒక తెలుగు మీడియం స్కూల్ ను ఏర్పాటు చేసేలా జారీచేసిన జీవో నెంబర్ 15 ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. తెలుగు మీడియం చదివేందుకు పాఠశాలకు వచ్చే విద్యార్థులకు రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వం భరిస్తుందని సదరు జీవో లో ఉందని మంత్రి తెలియజేశారు. ఈ వివరాలన్నింటినీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లామని మంత్రి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపై తాము ఎలాంటి వ్యాఖ్యానాలు చేయదలచుకోలేదన్నారు.

పేద కుటుంబాల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదా..అని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. హైకోర్టు తీర్పును టీడీపీ రాజకీయాలకు వాడుకుంటోందని విమర్శించారు. పేద కుటుంబాలకు మంచి చేయడమే సీఎం వైఎస్ జగన్ ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. ఉన్నత చదువులు తోనే పేదరికం నుంచి బయటపడగలరనే ఉద్దేశంతో నే సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో బోధన జరగాలనే నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం బోధనపై తాము కట్టుబడి ఉన్నామని, చట్టపరంగా ఈ అంశంపై ముందుకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు.