తుది దశకు వచ్చిన రాజ్యసభ పోలింగ్‌… టిడిపి ఎమ్మెల్యే అనగాని గైర్హాజర్

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ తుది దశకు వచ్చింది. ఈ రోజు ఉదయం ప్రారంభమైన పోలింగ్‌ మరికొద్దిసేపట్లో ముగియనుంది. ఇప్పటి వరకు 175 ఎమ్మెల్యేలకు గాను 167మంది తమ ఓట్లు వేశారు. అచ్చెం నాయుడు అరెస్ట్‌ కారణంగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. అనగాని సత్యప్రసాద్‌ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన తెలంగాణ రాష్ట్రం జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని తాను కలవడం వల్ల ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నందున ఓటింగ్‌కు రాలేకపోతున్నట్లు సత్యప్రసాద్‌ తెలిపారు. టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్ధాళి గిరిలు ఓటు వేశారు. ఇంకా మరో ఐదుగురు ఓటు వేయాల్పి ఉంది. వీరిలో టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి కూడా ఉన్నారు.

రహస్య బ్యాలెట్‌ విధానంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో తొలి ఓటు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వేశారు. టీడీపీ తరఫున తొలి ఓటు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వేశారు. వైసీపీ తనకున్న 151 ఎమ్మెల్యేల ఓట్లును మూడు రాజ్యసభ సీట్లకు 38 ఓట్ల చొప్పున, నాలుగో సీటుకు 37 ఓట్లను కేటాయించింది. టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఇద్దరు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్న నేపథ్యంలో మిగిలిన 20 మందిలో ముగ్గురు రెబల్‌ అభ్యర్థులు ఎవరికి ఓటు వేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఆరు గంటల కల్లా ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు వైసీపీ అభ్యర్థులదేనని తెలిసినా.. టీడీపీకి ఎన్ని ఓట్లు వస్తాయనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Show comments