Idream media
Idream media
ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లతో సమానంగా చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అందులోని ప్రతి అంశాన్ని అమలు చేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేశామని ఇటీవల ప్రకటించిన సీఎం జగన్.. మిగతా హామీలను కూడా అమలు చేసేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నారు.
తాజాగా మరో ముఖ్యమైన హామీ అమలుపై కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల వేళ.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. పలు బహిరంగ సభల్లోనూ చెప్పారు. ఇచ్చిన హామీ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు మొదటి ఏడాదిలోనే మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు. సదరు కమిటీ ఈ విషయంపై సమాలోచనలు జరుపుతోంది.
తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నిశాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఆయా విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమాచారం సేకరిస్తున్నారు. వారి నియామకం, విద్యార్హత, సంఖ్య.. తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఈ మొత్తం వివరాలను సేకరించిన తర్వాత క్రోడీకరించి మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించనున్నారు. క్రమబద్ధీకరణకు సర్వీస్ కటాఫ్‌ను పెడతారనే చర్చ సాగుతోంది. మొత్తం మీద మరికొన్ని రోజుల్లో ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండో ఏడాదిలోనే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.