Idream media
Idream media
మంచివాడైన అసమర్థుడు కన్నా.. చెడ్డవాడైన సమర్థుడు రాజ్యానికి రాజుగా ఉండడం మంచిదంటారు. అదే రాజు.. సమర్థుడు, మంచి వాడు కూడా అయితే ఆ రాజ్యంలోని ప్రజలకు నిత్యసంతోషమే. ఇప్పుడు అంధప్రదేశ్‌లోని ప్రజలు కూడా అదే సంతోషంలో ఉన్నారు. తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను చూసి.. తమకు సమర్ధుడే కాదు మంచి రాజు కూడా లభించాడని కొనియాడుతున్నారు.
ప్రజలు సీఎం వైఎస్ జగన్‌ను ఇలా కొనియాడడానికి ఓ ప్రధాన కారణం ఉంది. కరోనా వైరస్ కారణంగా దేశం లాక్‌డౌన్‌లో ఉంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పాలకులు ఓ చేత్తో కరోనాపై యుద్ధం చేస్తూ తమ ప్రజలను కాపాడుకుంటూనే మరో చేత్తో అదే ప్రజలు తిండికి ఇబ్బంది పడకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఈ కోవలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ముందు వరసలో ఉంటున్నారు.
ఇప్పటికే ప్రతి కుటుంబానికి 15 కేజీల బియ్యం, మూడు కేజీల కందిపప్పు మూడు విడతల్లో ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా గత నెల 29వ తేదీన మొదటి విడతగా ప్రతి వ్యక్తికి ఐదు కేజీల బియ్యం, రేషన్‌కార్డుకు కేజీ కందిపప్పు పంపిణీ చేశారు. ఈ రోజు ముందుగా చెప్పినట్లుగానే రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నగదు పంపిణీ చేస్తున్నారు.
పైన చెప్పిన విషయం.. సీఎం గత నెలలోనే నిర్ణయించింది. అయితే తాజాగా సీఎం వైఎస్ జగన్ ప్రజలకు మేలు చేసేలా ఆపత్కాలంలో మానవత్వాని చాటుతూ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్‌కార్డు ఉన్న వారికే కాదు.. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. వెయ్యి రూపాయల నగదు రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబాలకు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు నిన్న శుక్రవారం మంత్రి నాని ఈ విషయం వెల్లడించారు.
గత ఏడాది నవంబర్ నెలలో గ్రామ, వార్డు వాలంటీర్లు వైఎస్సార్ నవశకం పేరుతో ఇంటింటి సర్వే చేశారు. వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హులెవరో నిర్థారించారు. ఈ క్రమంలోనే అమ్మ ఒడి, ఆటోవాలాలకు ఆర్థిక సహాయం, వైఎస్సార్ నేతన్న హస్తం వంటి పథకాలు అందించారు. అదే సమయంలో రేషన్‌కార్డు కోసం అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా దరఖాస్తులను వాలంటీర్లే పూర్తి చేసి సచివాలయంలో అందజేశారు.
ప్రస్తుతం పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమం ముగియగానే కొత్త కార్డుల జారీ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మరి విజృంభించడంతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి. అయినా.. కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కష్టకాలంలో అండగా ఉండేందుకు వారిలో అర్హులైన వారికి నగదు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోవడం ప్రజల సంక్షేమం పట్ట ఆయనకున్న చిత్తశుద్ధి, ప్రేమ తెలియజేస్తోంది.