Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు దిశగా పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. రెండు రోజులు పాటు శాసన మండలిలో జరిగిన వ్యవహారాల నేపథ్యంలో మండలి విధులు, అధికారాలు, పని తీరు, ఖర్చు, మండలిలో సభ్యులు వ్యవహరించిన తీరుపై శాసన సభలో వాడీ వేడీ చర్చ సాగింది. శాసన సభలో మంత్రులు ప్రశంగాలు అన్నీ కూడా శాసన మండలి రద్దు చేయడమే మంచిదన్నట్లుగా సాగాయి. ఈ వ్యవహారం పై అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. మండలి కొనసాగాలా.. వద్దా అన్న అంశం పై సభలో చర్చ జరపాలని సీఎం జగన్ అసెంబ్లీ లో అన్నారు. సోమవారం దీనిపై సమావేశం నిర్వహించి చర్చ జరిపి నిర్ణయం తీసుకుందామని సీఎం పేర్కొన్నారు.
మండలిలో ఇలాంటి పరిస్థితి ఉండడంతోపాటు… ప్రభుత్వం తాను తీసుకుంటున్న నిర్ణయాలకు మండలిలో అడ్డుపుల్ల పడుతోంది. ప్రతిపక్ష పార్టీకి మండలిలో బలం ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రజా సంక్షేమానికి సంబంధించిన ముఖ్యమైన బిల్లులను కూడా మండలి ఆమోదించకుండా సవరణలు చేయడం, లేదా చర్చకు స్వీకరించకపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో శాసన సభ చేసిన దాదాపు 22 బిల్లులు మురిగిపోయాయి.
ఈరోజు ఉదయం విద్య చట్టం సవరణ బిల్లు పై సీఎం జగన్ సభలో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన బిల్లును ఆమోదించకుండా.. సవరణలు చేసి తిప్పి పంపడాన్ని ప్రస్తావించారు. రాజకీయేతర బిల్లు, ప్రజలకు మేలు చేసే ఇలాంటి బిల్లును కూడా మండలి ఆమోదించపోవడంపై తీవ్ర ఆవేదనతో మాట్లాడారు. తమపై ఎంతో నమ్మకంతో అధికారం ఇచ్చిన ప్రజలకు మంచి చేసేందుకు కూడా అడ్డంకులు ఏర్పడుతున్నాయని వాపోయారు.
మరోవైపు ఈ రోజు శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా మండలి వల్ల జరుగుతున్న నష్టాన్ని ప్రస్తావించారు. మండలి నిర్వహణకు ఏడాదికి 60 కోట్ల రూపాయల ఖర్చు అవుతోందని తెలిపారు. సలహాలు ఇచ్చేందుకు మండలి ఏర్పాటు చేస్తే.. బిల్లులను తిరస్కరిస్తోందని మండిపడ్డారు. దీనిపై ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని సూచించడంతో.. మండలి రద్దు జరుగుతుందన్న చర్చ సాగుతోంది.
చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూల్ 71 కింద చర్చకు పట్టుబట్టి తమ బలంతో అంగీకరింపజేసుకుని సెలక్ట్ కమిటీకి పంపించమని టీడీపీ ఎమ్మెల్సీలు చేసిన ఒత్తిడికి లొంగిన చైర్మన్ షరీఫ్ ‘‘ సందిగ్థత పరిస్థితి ఉంది. రూల్ ప్రకారం సెలక్ట్ కమిటీకి పంపడానికి లేదు. అయినా కాలాతీతమవుతోంది కాబట్టి తన విచక్షణాధికారాలతో సెలక్ట్ కమిటికీ పంపిస్తున్నాను’’ అని ప్రకటించి మండలిని నిరవధిక వాయిదా వేసి వెళ్లిపోయారు.
చైర్మన్ నిర్ణయంలో విచక్షణ కన్నా చంద్రబాబు నాయుడు పట్టుదలను గెలిపించే లక్ష్యంతోనే, ప్రభుత్వాన్ని ఓడించామన్న తృప్తిని చంద్రబాబుకు ఇవ్వడానికే చైర్మన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది.
రూల్స్ అతిక్రమించి విచక్షణ అధికారం పేరుతో శాసన మండలిని బలిపీఠమెక్కించారు. కాగా, ఈ నేపథ్యంలో సోమవారం జరగబోయే అసెంబ్లీ సమావేశంలో మండలి రద్దు బిల్లు ప్రవేశ పెడతారా..? లేదా..? అనేదాని పై ఉత్కంఠ నెలకొంది
.