iDreamPost
android-app
ios-app

ఎన్నికలను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ వింత వాదన

ఎన్నికలను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ వింత వాదన

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగడం లేదని, అధికార వైసిపి భయోత్పాతం సృష్టిస్తుందని ఆరోపిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ శుక్రవారం రాజ్ భవన్ లో గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ ని కలిశాడు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితుల దృశ్యా స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చెయ్యాలని శైలజా నాధ్ గవర్నర్ కి వినతి పత్రం ఇచ్చారు. గవర్నర్ తో భేటీ తర్వాత శైలజానాధ్ విలేకరులతో మాట్లాడుతూ పోటీ చేసే అభ్యర్థులకు సంభందించిన పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్, కులధ్రువీకరణ పత్రాలు జారీలో ఉత్పన్నమౌతున్న అడ్డంకులను గవర్నర్ తో చర్చించానని తెలిపారు.

కాగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని రద్దు చెయ్యాలనే కొత్త వాదాన్ని సాకే శైలజానాధ్ తెరపైకి తేవడం చూస్తుంటే.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కూడా ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పంధాలోనే వెళుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజాస్వామ్య పరిరరక్షణ కోసం ఎన్నికలను రద్దు చేయాలని శైలజానాధ్ డిమాండ్ చెయ్యడం ఏంటని కాంగ్రెస్ పార్టీకే చెందిన పలువురు నేతలు పెదవి విరుస్తున్నారు.

ఒకపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఇంత భారీ స్థాయిలో ఎన్నికల ప్రక్రియ జరుగుతుంటే, అన్ని రాజకీయ పక్షాలకు చెందిన ఆశావాహులు ఉత్సహాహంగా నామినేషన్లు ధాఖలు చేస్తున్నారు. మొత్తం 652 జెడ్పిటిసిలకు గానూ 4,778 మంది, అదేవిధంగా 9,696 ఎంపీటీసీ స్థానాలకు గాను 50,064 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగిన మాట వాస్తవమే. ఆ చిన్న చిన్న సంఘటనలను బూచిగా చూపి శైలజా నాధ్ మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేయమనడం ఏంటని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యపోతున్నారు. చూస్తుంటే ఈయన కూడా చంద్రబాబు ట్రాప్ లో వున్నాడా అన్న అనుమానం కలుగుతుందని వారు ఎద్దేవా చేశారు.

కొత్తగా పీసీసీ బాధ్యతలు చేప్పట్టిన నూతన కార్యవర్గం సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చెయ్యాల్సింది పోయి స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపికలో మిగతా ప్రధాన పక్షాలకన్నా దారుణంగా వెనుకబడటం రాష్ట్రంలో ఆ పార్టీ ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతుంది. ఈసారి ఎన్నికల్లో మొత్తం 652 జెడ్పిటిసిలకు గాను కేవలం 360 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను పోటీలో పెట్టగలిగింది. ఇక ఎంపీటీసీల విషయానికి వస్తే మొత్తం 9696 స్థానాలకు గానూ కేవలం 395 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను బరిలోకి దింపగలిగింది. ఆ విషయంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ జనసేన పార్టీ కంటే కూడా బాగా వెనుకబడింది.

వాస్తవానికి క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క జెడ్పిటిసి అయినా గెలుచుకుంటుందని ఆ పార్టీలో కూడా ఎవరికీ నమ్మకం లేదు. ఇలాంటి సమయంలో నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలమీద పోరాటం చేస్తే పరిస్థితుల్లో కాస్తయినా మార్పు వచ్చే అవకాశం వుంది. అంతేగాని వ్యక్తిగత వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి మొత్తం ఎన్నికల వ్యవస్థనే రద్దు చేయమనడం ఎంతవరకు సబబు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం ఆకాంక్ష నెరవేరాలంటే, స్థానిక సంస్థలను బలోపేతం ఒకటే మార్గమని, స్థానిక సంస్థలను బలోపేతం చేసి వాటికి అధికారాలు బదలాయించడం ద్వారా అభివృద్ధి ఫలాలు నేరుగా ప్రజలకు అందుతాయని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 73, 74 లను ప్రవేశపెట్టడం ద్వారా ఆ ప్రయత్నంలో వియజయవంతం అయిందనే చెప్పాలి. అలాంటి నేపధ్యం ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర పీసీసీ కి సారధ్యం వహిస్తున్న సాకే శైలజా నాధ్ స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చెయ్యాలని డిమాండ్ చెయ్యడం హాస్యాస్పదంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.