iDreamPost
android-app
ios-app

నేడు మంత్రివర్గ సమావేశం.. మండలి రద్దు తో పాటు..

నేడు మంత్రివర్గ సమావేశం.. మండలి రద్దు తో పాటు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నేడు సోమవారం ఉదయం 9.30 గంటలకు జరగనుంది. లెజిస్లేటివ్‌ రాజధానితోపాటు ఎగ్జిక్యూటివ్‌ రాజధాని, జ్యుడీషియల్‌ రాజధాని ఏర్పాటు బిల్లు, సీఆర్‌డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు బిల్లు మండలిలో నిలిచిపోయిన నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలోచర్చించనున్నారు. శాసన మండలి రద్దుకు అనుకూలంగా కేబినెట్‌ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Read Also: మండలి రద్దుకు కేబినెట్‌ ఆమోదం

మండలి రద్దు నిర్ణయం తోపాటు మరికొన్ని అంశాలపై కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మచిలీపట్నం పోర్టు నిర్మాణాలపైనా నిర్ణయం తీసుకోనున్నారు. అర్హులైన పేదలందరికీ ఉగాది పర్వదినం రోజున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూముల సేకరణపైనా చర్చించనున్నారు.

కేబినెట్‌ భేటీ అనంతరం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో.. బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత శాసన మండలి లో తలెత్తిన పర్యవసానాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. శాసన మండలి పనితీరు, ప్రతిపక్షం అనుసరించిన విధానం పై చర్చించనున్నారు. అనంతరం ఏపీ శానస మండలిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆమోదించనున్నట్లు సమాచారం.