iDreamPost
android-app
ios-app

ఒత్తిడిలో ఏపీ బీజేపీ

  • Published Dec 11, 2020 | 1:24 PM Updated Updated Dec 11, 2020 | 1:24 PM
ఒత్తిడిలో ఏపీ బీజేపీ

ఏపీ బీజేపీపై ఒత్తిడి పెరుగుతోందా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ఇంకా ఎన్నికలు సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే పెరగడం ఎందుకు మొదలైందన్నదానికి తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికను కారణంగా చూపుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటి వరకు తెలంగాణా బీజేపీ రెండు ఎన్నికలను ఎదుర్కొంది. దుబ్బాక ఉప ఎన్నికతోపాటు, జీహెచ్‌యంసీ ఎన్నికలు ఈ రెండూనూ. వాటిలో దుబ్బాకలో అనూహ్య విజయం దక్కించుకోగా, జీహెచ్‌యంసీలో కూడా అధికార పార్టీ కంటే కేవలం పదిశాతం ఓట్లు మాత్రమే వెనకబడి ప్రత్యర్ధులకు బలమైన సంకేతాలను ఇచ్చింది. దీంతో తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆ పార్టీ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపే లభించింది.

ఇప్పుడు ఏపీ బీజేపీ వంతు వచ్చింది. తోటి రాష్ట్రంలో అనూహ్య విజయాలను సాధిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి ఏపీ బీజేపీపైకి మళ్ళుతోందంటున్నారు. ఇప్పుడు ఏపీలో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్టామినాపై అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారన్న భావన రాజకీయవర్గాల్లో బలంగానే విన్పిస్తోంది. అధికార వైఎస్సార్‌సీపీ తన స్థానానికి నిలబెట్టుకునేందుకు వ్యూహాలు పన్నుతుండగా, ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరికంటే ముందుగానే అభ్యర్ధిని ప్రకటించి తన రాజకీయ చతురతను ప్రదర్శించింది. అయితే ఇప్పటి వరకు బీజేపీ తన తాజా సహచరి జనసేనలు మాత్రం ఇంకా అభ్యర్ధి ప్రకటనలో అమోయంలోనే ఉన్నారు.

ఎవరు పోటీ చేయాలి? అన్న చోటే పీఠముడి పడుతుండడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతోందన్న అభిప్రాయాన్ని పలువురు పరిశీలకులు చెబుతున్నారు. జీహెచ్‌యంసీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన రెండు రోజులకే పవన్‌ వెనక్కి తగ్గారు. తగ్గారు అనడం కంటే తగ్గించారు అనడమే భావ్యంగా ఉంటుందంటున్నారు. ఇప్పుడు తిరుపతిలో కూడా జనసేన పోటీ చేస్తాను అంటే వెనక్కి లాగే ప్రయత్నాలను బీజేపీ తప్పక చేస్తుందని చెప్పుకొస్తున్నారు.

అయితే ఈ విషయంలో ముందుగానే అప్రమత్తమైన జనసేనాని ఢిల్లీకి పయనం కట్టి హామీ కోసం ప్రయత్నించినప్పటికీ బీజేపీ అధిష్టానం నుంచి ఖచ్చితమైన హామీ వచ్చిన దాఖలాల్లేవుంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన–బీజేపీల మధ్యన ఏర్పడుతున్న గ్యాప్‌ను పూరించుకోవడంతో పాటు, అధికార వైఎస్సార్‌సీపీ ధీటుగా ఎదుర్కొవాలంటే బీజేపీకి పెద్ద హోం వర్కే అవసరపడుతుందంటున్నారు. జీహెచ్‌యంసీ ఎన్నికల మాదిరిగా బీజేపీ జాతీయ స్థాయి నాయకత్వమంతా దిగివచ్చి మద్దతుగా నిలిచే పరిస్థితి లేని నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక భారాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజే పూర్తిస్థాయిలో భుజాలపై మోయాల్సి ఉంటుందంటున్నారు. ఇది ఒక రకంగా సోము నైపుణ్యానికి బలపరీక్షలాంటిదేనని చెప్పుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలోనై రాష్ట్ర బీజేపీ నేతలపై ఒత్తిడి పెరుగుతోందని వివరిస్తున్నారు. తెలంగాణాలో బీజేపీతో పోల్చుకునే పరిస్థితులు ఏపీలో లేకపోయినప్పటికీ ఆ స్థాయిలో హడావిడి మాత్రం మొదలు కావడంతో ఒత్తిడి మరింతగా పెరుగుతోందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలో ఎటువంటి వ్యూహాన్ని సోము వీర్రాజు బృందం అనుసరిస్తుందో వేచి చూడాల్సిందేనంటున్నారు.