Idream media
Idream media
బడ్జెట్ ఆమోదం కోసం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పండింది. ఈ రోజు లంచ్ విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన శాసనసభలో మొదట చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అమరులైన 20 మందిజవాన్లకు సభ సంతాపం తెలిపింది. ఈ తీర్మానాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు.
ఆ తర్వాత ఎన్‌ఆర్‌సీ, ఎన్పీఆర్‌పై ఉన్న అపోహలు తొలగించాలని మార్చిలో ఏపీ మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని సభ ఆమోదం కోసం ముస్లిం మైనారిటీ వ్యవహారాల మంత్రి సభలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చల్ డెవలెప్‌మెంట్ అథారిటీ – 2020 ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన బిల్లును మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి మోపీదేవి వెంకట రమణ సభలో ప్రవేశపెట్టారు. వీటన్నింటికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 2020–21 ఆర్థిక ఏడాదిలో మిగిలిన 9 నెలలకు అవసరమైన ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత సభను స్పీకర్ తమ్మినేని సీతారాం నిరవధికంగా వాయిదా వేశారు.
మార్చి నెలలో జరగాల్సిన బడ్జెట్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఈ పరిస్థితిలో మూడు నెలలకు అవసరమైన బడ్జెట్ కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. సదరు గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అవసరమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కోవిడ్ కారణంగా రెండు రోజుల పాటు సభ నిర్వహించాలని శాసన సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) నిర్ణయించింది.
కాగా, ఈ నెల 19వ తేదీన రాజ్యసభ ఎన్నికకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మరోమారు ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ వద్దకు రానున్నారు. ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఐదుగురు పోటీలో నిలవగా పోలింగ్ తప్పలేదు. తగినంత బలం లేకపోయినా టీడీపీ తన అభ్యర్థిగా వర్ల రామయ్యను బరిలోకి దింపింది. వైసీపీ తరఫున మోపీదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీలు బరిలో నిలిచారు. సభలో వైసీపీకి 151 సీట్లు ఉన్న నేపథ్యంలో వీరి ఎన్నిక లాంఛనమే కానుంది.