iDreamPost
android-app
ios-app

నేడు అసెంబ్లీ.. అందరి దృష్టి మండలిపైనే..!

నేడు అసెంబ్లీ.. అందరి దృష్టి మండలిపైనే..!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించనున్నారు. అనంతరం వెంటనే బడ్జెటన్‌ ప్రవేశపెట్టనున్నారు. శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, శాసన మండలిలో రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. 2.25 లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను వైసీపీ సర్కార్‌ ప్రవేశపెట్టబోతోంది. జగన్‌ సర్కార్‌ ఏర్పాడ్డకా ఇది రెండో బడ్జెట్‌. బడ్జెట్‌కు అనుబంధంగా 25 వేల కోట్ల రూపాయలతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

కోవిడ్‌ నేపథ్యంలో పటిష్ట రక్షణ చర్యలు, ఆంక్షలతో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అవినీతి, అక్రమాల కేసుల్లో ఇటీవల టీడీపీ ఉపనేత, మాజీ మంత్రి అచ్చెం నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిల అరెస్ట్, చంద్రబాబు ప్రభుత్వ హాయంలో అమలు చేసిన చంద్రన్న కానుక, తోఫా, క్రిస్మస్‌ కానుక పథకాల్లో చోటుచేసుకున్న అవినీతి, ఫైబర్‌ నెట్‌ పథకంలో అక్రమాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అసెంబ్లీ, మండలి సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షం తమ పార్టీ సభ్యులపై అక్రమ కేసులు పెడుతున్నారనే అంశం ప్రధానంగా ఫోకస్‌ చేయనుండగా.. అధికార పార్టీ వైసీపీ చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అమరావతి భూ కుంభకోణం వంటి అంశాలతో ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టే అవకాశం ఉంది.

అసెంబ్లీతో పాటు ఈ సారి మండలి సమావేశాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. గత సమావేశాల్లో సీఆర్‌డీఏ, రాజధాని వికేంద్రీకరణ బిల్లులు ఆగిపోవడం, సెలెక్ట్‌ కమిటీకి పంపాలని చైర్మన్‌ నిర్ణయించడం, మండలినే రద్దు చేయాలని వైసీపీ సర్కార్‌ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం.. వంటి పరిణామాల నేపథ్యంలో ఈ దఫా జరిగే మండలి సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. మండలి కథ కంచికి చేరిందని అందరూ భావించగా.. కరోనా వైరస్‌ వల్ల పార్లమెంట్‌ సమావేశాలు ముందుగానే ముగించడంతో మండలి ప్రస్తుతం కొనసాగుతోంది.