iDreamPost
android-app
ios-app

గుజరాత్‌లో మరో కాంగ్రెస్ వికెట్ డౌన్….రెండు స్థానాల గెలుపు ఆశలకు గండి

గుజరాత్‌లో మరో కాంగ్రెస్ వికెట్ డౌన్….రెండు స్థానాల గెలుపు ఆశలకు గండి

గుజరాత్‌లో అధికార బిజెపి రాజ్యసభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష కాంగ్రెస్ శిబిరాన్ని దెబ్బతీయటానికి రాజకీయ చదరంగం మొదలెట్టింది. దీంతో బుధవారం ఇద్దరూ ఎమ్మెల్యేల రాజీనామా సందర్భంగా మీడియాలో వెలువడిన కథనాలను నిజం చేస్తూ శుక్రవారం మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశాడు.తాజాగా రాజ్‌కోట్ సమీపంలోని మోర్బీ నియోజకవర్గ ఎమ్మెల్యే బ్రిజేష్‌ మెర్జా శాసనసభ సభ్యత్వంతోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా సమర్పించాడు. ఆయన రాజీనామాను స్పీకర్‌ రాజేంద్ర త్రివేది ఆమోదించినట్లు అసెంబ్లీ అధికారులు ప్రకటించారు.

గుజరాత్‌లో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గత మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి మొత్తం ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ బలం 65 కు పడిపోగా 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీలో పది ఖాళీలు పోగా ప్రస్తుతం 172 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.కాగా ఎగువ సభ ఎన్నికలలో భారతీయ ట్రైబల్‌ పార్టీ పార్టీకి చెందిన ఇద్దరు, ఎన్‌సీపీ ఒక ఎమ్మెల్యేతో పాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఓట్లు కీలకంగా మారాయి.

అయితే జూన్‌ 19న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల పరంపర కొనసాగుతుండడం గమనార్హం.ఇక రాజ్యసభ ఎన్నికలలో విజయం సాధించడానికి తమ పార్టీని విచ్చిన్నం చేయడానికి అధికార బిజెపి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.అవినీతి మార్గాల ద్వారా సంపాదించిన డబ్బుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేస్తుందని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు పరేష్ ధనాని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బిజెపి ఖండించింది.

ఎన్నికల విషయానికొస్తే రాజ్యసభకు ఎన్నిక అయినందుకు ఒక్కొక్క అభ్యర్థికి ఏక ఓటు బదలాయింపు (STV) పద్ధతి ప్రకారం కనీసం 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.వాస్తవానికి అధికార బిజెపి,ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు చెరో రెండు రాజ్యసభ ఎంపీ సీట్లు ఏకగ్రీవంగా గెలిచే పరిస్థితి ఉంది. కానీ అధికార బిజెపి మూడో అభ్యర్థిని బరిలోకి దించి గుజరాత్‌లో ఎమ్మెల్యేల రాజీనామా అంకానికి తెర లేపింది. బిజెపి అభ్యర్థులుగా అభయ్ భరద్వాజ్,రమీలా బారా, నర్హారీ అమీన్‌లు పోటీ చేస్తుండగా కాంగ్రెస్ తరుపున సీనియర్ నాయకులు శక్తిసింహ్ గోహిల్, భరత్‌ సిన్హ్ సోలంకి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

కానీ ప్రస్తుతం బిజెపి పవర్ పాలిటిక్స్ గమనిస్తే కాంగ్రెస్ విజయావకాశాలు ఒక్క సీటుకే పరిమితం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.