పరిపాలనా రాజధాని సిగలో మరో ఘనత

రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయని విశాఖపట్నం మరోసారి నిరూపించుకుంది. తాను అభివృద్ధి చెందుతూ ఇతర నగరాలను సైతం చేయిపట్టుకొని నడిపించగల సత్తా ఉందనే ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న వైజాగ్‌.. కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూకు అభివృద్ధిలో మార్గనిర్ధేశం చేయనుంది. దేశంలోని 100 నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేసేందుకు రూ. 2.05 లక్షల కోట్లతో 5,151 ప్రాజెక్టులను కేంద్రం చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని నగరాలు స్మార్ట్‌ సిటీలుగా సూపర్‌ వేగంతో దూసుకుపోతుండగా మరికొన్ని నగరాలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో అభివృద్ధిలో టాప్‌20లో ఉన్న నగరాలు.. అట్టడుగున ఉన్న 20 నగరాలకు చేయూత అందించేలా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 20–20 ప్రణాళికను సిద్ధం చేసింది. స్మార్ట్‌ సిటీలలో దేశంలోనే విశాఖపట్నం తొమ్మిదో స్థానంలో ఉంది. దీంతో అభివృద్ధిలో వెనకబడి ఉన్న డయ్యూ నగరానికి సహాయం అందించేందుకు విశాఖకు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డయ్యూ నగరం త్వరలోనే విశాఖతో ఒప్పందం చేసుకోనుంది. డయ్యూ అభివృద్ధికి 100 రోజుల ప్రణాళికలు రెడీ చేయడం, తగిన సూచనలు ఇవ్వడం లాంటి కార్యక్రమాలను విశాఖ పురపాలక అధికారులు చేయనున్నారు.

గతంలో వచ్చిన అవార్డులు..

దేశంలోనే సుందర నగరంలా ఖ్యాతిని ఆర్జించిన విశాఖ పట్నానికి ప్రణాళికబద్ధమైన నగరంగా పేరుంది. ఇటు పేదలు, మధ్య తరగతి ప్రజలు జీవించడానికి అనువైన పరిస్థితులు ఉండడంతోపాటుగా ధనికుల కోసం లగ్జరీ వసతులు ఉన్నాయి. దీనివల్లే విశాఖ నగరం ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. స్మార్ట్‌సిటీల అభివృద్ధిలో ఉత్తమ పనితీరును కనబర్చినందుకు గాను ఇటీవలే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఒక అవార్డును ఇచ్చింది. అలాగే ఫ్లోటింగ్‌ సోలార్‌ ఏర్పాటులోనూ అవార్డు లభించింది. గతంలో స్వచ్ఛ సర్వేక్షన్‌ పేరిట కేంద్రం నగరాలను ప్రకటించగా అందులో ఐదో స్థానాన్ని సొంతం చేసుకుంది.

Show comments