Idream media
Idream media
యాక్చువల్‌గా పక్కవాళ్లు మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. మొదట్లో నేను పెళ్లిళ్లకు, పండగలకు మైకులు పెడుతుండేవాడిని. ఎక్కడో బేగంపేటలో మైక్ పెడితే ఇక్కడ అమిర్ పేటలో వినిపిస్తోంది. అలాంటిది మా ఇంట్లో మైక్ పెడితే ఇక్కడ నేను ఆఫీస్‌లో వినలేనా అనిపించింది. అప్పుడే ఈ సీక్రెట్ మైక్ కనుగొన్నాను… మన్మథుడు సినిమాలో కథానాయకుడు నాగార్జున తో దివంగత హాస్య నటుడు ధర్మవరపు సుబ్రమణ్యం పై విధంగా మాట్లాడతారు. ధర్మవరపు మాటలతో ఉత్తేజుడైన నాగార్జున ఆ మైక్‌ను కొనుగోలు చేసి తన ఆఫీస్‌లో మహిళా ఉద్యోగుల టేబుల్ కింద పెట్టి తన ఛాంబర్‌లో కూర్చుని వారు ఏమి మాట్లాడుకుంటున్నారో వింటుంటారు. అచ్చు ఇలాంటి మైకునే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొనుగోలు చేసినట్లు దేశంలో ప్రచారం సాగుతోంది.
దేశంలో ఏ మీడియా సంస్థకు తెలియని రహస్యాలు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురిస్తుండడం దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా ప్రధాన మంత్రి ఛాంబర్‌లో జరిగిన సన్నివేశాల తాలూకు సంభాషణలు, హావాబావాలతో సహా ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించడంతో దేశంలో రాజకీయ పార్టీలు, ప్రధాన మంత్రి కార్యాలయం ఉలిక్కిపడింది. నిన్న బుధవారం సాయంత్రం దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దాదాపు గంట 40 నిమిషాలు భేటీ అయ్యారు. ప్రధాని మోదీ, సీఎం జగన్‌ల మధ్య జరిగిన సంభాషణ, సీఎం జగన్‌పై మోదీ ఆగ్రహం, అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా ఆంధ్రజ్యోతి ఈ రోజు రాసుకొచ్చింది. రాతలతోపాటు ప్రధాని సీఎం వైఎస్ జగన్‌పై అసహనం వ్యక్తం చేస్తున్న సమయంలో మోదీ ముఖకవళికలు ఎలా ఉన్నాయో కూడా చెప్పుకొచ్చింది.
‘‘విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) పునఃసమీక్ష వద్దని కేంద్రం, కోర్టులు చెప్పినా వినకపోవడం, కియా మోటార్స్‌కు బెదిరింపు, ఆ సంస్థ తమిళనాడుకు తరలిపోనుందన్న ప్రచారం తదితర అంశాలను ప్రధాని మోదీ సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు వెనుకాడుతున్నారని, దీని ప్రభావం దేశం మొత్తంపై పడుతుందని మోదీ స్పష్టం చేశారు’’ అంటూ రాసుచొచ్చిన ఆంధ్రజ్యోతి.. పెట్టుబడుల విషయంలో జాగురతతో వ్యవహరించాలని ప్రధాని మోదీ సీఎం జగన్‌కు హితవు చెప్పారంటూ .. అంతా విన్నట్లు, చూసినట్లుగా రాసుకొచ్చింది.
సీఎం జగన్ వినతిప్రతం ఇచ్చి అందులోని ఒక్కొక్క అంశాన్ని వివరిస్తున్నప్పుడు ప్రధాని మోదీ మౌనం దాల్చారంటూ.. అంతా చూసినట్లుగా రాసింది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని లోక్‌సభలో చెప్పినా కూడా.. సీఎం జగన్ ప్రత్యేకహోదా గురించి ప్రస్తావించిన సమయంలో ప్రధాని సీరియస్‌గా విన్నారంటూ చెప్పుకొచ్చింది. మూడు రాజధానుల విధానం ఎందుకు తీసుకున్నామో సీఎం జగన్ ప్రధాని మోదీకి సుదీర్ఘంగా వివరించినట్లు పేర్కొంది.
ఈ రోజు ఉదయం ఆంధ్రజ్యోతి పత్రిక చూడడంతోనే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఒక్కసారిగా ఉలిక్కిపడిందట. ప్రధానిమోదీ సీఎం జగన్‌ల మధ్య జరిగిన సంభాషణ యథావిధిగా ఆంధ్రజ్యోతి పత్రిక రాయడంతో అసలు ఈ విషయాలు ఎలా బయటకు పొక్కాయోనని తలలు పట్టుకున్నారట. పీఎంవోలో ఒక్కసారిగా కలకలం రేగిందట. ఈవిషయంపై ప్రధాని మోదీ కూడా సీరియస్ అయ్యారట. వేకువజామునే సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి తాను మాట్లాడిన విషయాలు ఆంధ్రజ్యోతి పత్రికలో రావడంపై ఆవేదన వ్యక్తం చేశారట.
సూర్య కథనాయకుడిగా నటించిన ‘బందోబస్తు’ సినిమాలోలాగా ప్రధాని ఛాంబర్‌లో స్పై మైక్‌లు ఏమైనా పెట్టారేమోనని భద్రాతాధికారులు సోదాలు చేస్తున్నారు. అనువణువునా గాలిస్తున్నారు. ప్రధానితోపాటు రాష్ట్ర పతి, కేంద్రమంత్రుల ఛాంబర్లలోనూ సోదాలు చేయాలని హోం శాఖ వర్గాలు ఆదేశాలు జారీ చేశాయి. రేపో ఎల్లుండో.. సీఎం వైఎస్ జగన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు మళ్లీ ఢిల్లీ వస్తుండడంతో… హోం మంత్రి ఛాంబర్‌ను జల్లెడ పడుతున్నారట.
ప్రధాని మోదీ, సీఎం జగన్‌ల మధ్య సంభాషణను యథావిధిగా ప్రచురించి.. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టించిన వేమూరి రాధాకృష్ణకు వేకువజాము నుంచి ప్రశంసల వెల్లువ కొనసాగుతోందట. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటగా ఫోన్ చేసి.. ఫోన్‌లోనే భుజం తట్టినట్లుగా అభినందించారట. ఆ వెంటనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, నిన్ననే ఢిల్లీ పీఠం గెలిచిన కేజ్రీవాల్ ప్రత్యేకంగా అభినందించారట. ప్రముఖ ఎన్నికల హ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇకపై కలిసి పనిచేద్దామని వేమూరి రాధాకృష్ణకు స్నేహహస్తం అందించారట. మనమిద్దరం కలిస్తే.. దేశ రాజకీయాలను శాసించవచ్చని, ప్రధానులను, ముఖ్యమంత్రులను మనమే నిర్ణయించొచ్చని చెప్పినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమయంలో రాధాకృష్ణ చిరునవ్వులు చిందించారు.
చివరగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి… తాను మోదీ వద్దకు వెళ్లినప్పుడు మాత్రం అక్కడ జరిగిన విషయాలు రాయొద్దని ప్రాధేయపడ్డారట. ఆ సమయంలో రాధాకృష్ణ మొఖం సీరియస్‌గా పెట్టినట్లు తెలిసింది. రాజకీయ ప్రశంసలు ముగిసిన వెంటనే మీడియా సంస్థల అధినేతలు నుంచి అభినందనల వర్షం కురిసిందట. వికీలీక్స్ అధినేత అసాంజే ఫోన్ చేసి తనకు పోటీగా వస్తున్నారని అభినందించీ.. ఇదే ఒరవడి ఇకపై కొనసాగించాలని కోరినట్లు తెలిసింది.