Jana Nayakudu Movie Review: దళపతి విజయ్ చివరి చిత్రంగా వచ్చిన ‘జన నాయకుడు’ ఎలా ఉంది? విజయ్‌కు సరైన ఫేర్వెల్ మూవీగా నిలిచిందా? పూర్తి రివ్యూ & రేటింగ్.
Jana Nayakudu Movie Review: దళపతి విజయ్ చివరి చిత్రంగా వచ్చిన ‘జన నాయకుడు’ ఎలా ఉంది? విజయ్‌కు సరైన ఫేర్వెల్ మూవీగా నిలిచిందా? పూర్తి రివ్యూ & రేటింగ్.
వి రాజా
ఈకాలంలో ఆ కాలం సినిమా. జెన్ జీ యుగం నడుస్తోంది. ఓటిటి లో ప్రపంచ సినిమా దర్శనం ఇస్తోంది. కానీ భారీ సినిమాలు తీయాలి అంటే మాత్రం మనవాళ్లకు కథలు కరువు. హీరోలను కొత్త తరహా కథలు చెప్పి ఒప్పించడం అంత వీజీ కాదు. ఎంత సేపూ మాఫియా, గన్స్ వీటి చుట్టూ కథను తిప్పాలి. వీలైతే ఓ వరల్డ్ ను సృష్టించాలి. అలా సృష్టిస్తే లాజిక్ లతో పని లేదు. విచ్చలవిడిగా నేరాలు..ఘోరాలు తెరమీదకు తెచ్చేయచ్చు. ఈవారం వచ్చిన సూపర్ స్టార్ విజయ్ సినిమా కూడా అలాంటిదే.
సినిమా కు అనుకున్న బడ్జెట్ ను ఎలా ఖర్చు చేయాలా అన్న కోణంలో ఆలోచించి సీన్లు రాసుకుంటారు తప్ప, కథ ఎలా ఏ దారిన వెళ్లాలి, అలా వెళ్లడానికి ఏ యే సన్నివేశాలు అవసరం, అవి ఎంత మేరకు చిత్రీకరించాలి అన్నది మాత్రం చూసుకోరు. ఇలాంటి వ్యవహారానికి తాజా ఉదాహరణ జననాయకుడు.
మన తెలుగు సినిమా భగవంత్ కేసరి కి రీమేక్ ఈ సినిమా. భగవంత్ కేసరి సినిమాలోని రెండు మూడు కీలకపాత్రలు తీసుకుని, దానికి భారీ స్టయిల్ విలన్ ట్రాక్ ను జోడించి కథ తయారు చేసుకున్నారు. పెంపుడు తండ్రి, కూతురు అనుబంధం, ఆ కూతురు జోలికి వచ్చిన విలన్, దాంతో మొత్తం వ్యవహారాన్ని అడ్డుకుని దేశాన్ని కాపాడిన తండ్రి. ఇదీ కథ.
భగవంత్ కేసరి సినిమాలో కీలకమైనది పెంపుడు తండ్రి-కూతుళ్ల మధ్య అనుబంధం, భావోద్వేగాలు.ఆ తరువాత ఓ కమర్షియల్ మాస్ సినిమాకు కావాల్సిన విలన్ ట్రాక్. కానీ జననాయకన్ లో విలన్ ట్రాక్ ముందు సీటులోకి వచ్చింది. తండ్రి-కూతుళ్ల అనుబంధం వెనక్కు వెళ్లిపోయింది. దాంతో భారీ పోరాటాల మాస్ కమర్షియల్ సినిమాగా మారిపోయింది జననాయకన్. సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి చివరి వరకు పోరాటాలే పోరాటాలు. పదులు కాదు, వందలు కాదు. వేల సంఖ్యలో శవాల గుట్టలు, కాల్పులు, రక్తపుటేరులు ఇదే సినిమా అంతా. వీటి మధ్యలో హీరో ఎలివేషన్ సన్నివేశాలు, తమిళనాడు రాజకీయాల కోసం, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న సంభాషణలు.
సినిమా తొలిసగం ఓ మాదిరిగా వుంది అనిపించుకుంటుంది. కానీ మలిసగం మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించేస్తుంది. కోట్లకు కోట్ల డబ్బు కుమ్మరించి, భారీ సన్నివేశాలు, పోరాటాలు చిత్రీకరించారు కానీ అవేవీ ఆకట్టుకోవు. ప్రేక్షకుడు కళ్లు అప్పగించి చూడడమే తప్ప కాస్తయినా మమేకం అయ్యేది వుండదు. ఇలా వెళ్లిన సినిమా చివరకు వచ్చేసరికి రోబోల యుద్దం, రిమోట్ కంట్రోల్ యుద్దం అంటూ హాలీవుడ్ అద్దకాలు అద్దుకోవాలని చూస్తుంది.
ఇలా మొత్తం సినిమాలో హీరో ఎలివేషన్ పాట, హీరోయిన్ తో డ్యూయట్ పాట రెండూ తేలిపోయాయి. కొన్ని సన్నివేశాల కోసం చేసిన కంప్యూటర్ గ్రాఫిక్స్ బాగా నాసిరకంగా వున్నాయి. అర్థం లేని పోరాట సన్నివేశాల కోసం కోట్లకు కోట్లు ఖర్చుచేసేసారు. అవసరమైన భావోద్వేగ సన్నివేశాలకను బలంగా తెరకెక్కించలేకపోయారు. ఎంత సేపూ రాజకీయంగా పనికి వచ్చే సంభాషణల మీద దృష్టి పెట్టారు తప్ప, బలమైన డైలాగులు రాసుకోలేకపోయారు. సాంకేతికంగా సినిమా భారీగా వుంది కానీ నేపథ్యసంగీతం అతకలేదు. భారీ శబ్దాలు తప్ప సన్నివేశాలకు సరిపోయేలా లేదు. మొత్తం మీద జననాయకుడు సినిమా జనాలను ఆకట్టుకునేలా మాత్రం తయారు కాలేదు.