iDreamPost
android-app
ios-app

దేశంలో తొలిసారిగా ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్

దేశంలో తొలిసారిగా ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్

కరోనా లాక్ డౌన్ వల్ల కఠిన పరిస్థితులు ఎదురైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే తొలిసారిగా ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.

విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఫలితాలను విడుదల చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆన్లైన్ లో మాత్రమే ఫలితాలను విడుదల చేసారు. విద్యార్థులు హాల్‌ టికెట్‌ నంబరు, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు.

విద్యాశాఖ మంత్రి   ఆదిమూలపు సురేశ్‌ మాట్లాడుతూ కోవిడ్ వల్ల ఏర్పడిన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంటర్ ఫలితాలు విడుదల చేసిందని తెలిపారు. దేశంలో ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. మార్చ్ 19 నుండే పేపర్ వేల్యూషన్ మొదలైందని జూన్ 15 నుండి మెమోలు జారీ చేస్తామని తెలిపారు. కళాశాలలు తమ విద్యార్థుల ర్యాంకులతో ప్రకటనలు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు.

కాగ 10,65,155 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయగా.. ఫస్ట్ ఇయర్ పరీక్షలు 5,07,227 మంది విద్యార్థులు రాయగా 3,00,560 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ పరీక్షలు 4,88,795 మంది విద్యార్థులు రాయగా 2,76,389 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో 59% మంది ఉత్తీర్ణత సాధించగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 63% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు..