తప్పు జరిగితే తప్పు అని చెప్పడం వరకు బాగుంటుంది. కానీ ప్రతి దాన్ని తప్పు తప్పు తప్పు అంటే ఆఖరికి పులి మేక కథలా మారిపోతుంది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన విషయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అయితే ఒక్కోసారి వారు రాసే ఎదుట వారిని కావాలని రెచ్చగొట్టేలా ఉంటాయి. వాస్తవాలను వక్రీకరిస్తూ ఉన్నది లేనట్టు చూపించే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో శనివారం పతాక శీర్షికలో వ్యాక్సిన్ విషయాన్ని ప్రస్తావించారు. 1600 కోట్లు పెడితే రాష్ట్రంలోని 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని, కంపెనీల వద్ద స్టాక్ ఉన్నా.. కానీ ప్రభుత్వం అంత మొత్తం వెచ్చించేందుకు ముందుకు రావడం లేదని ఆ కథనంలో రాశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు టీకా విషయంలో చెప్పాలని, విపత్తు సమయంలో ప్రజలను మభ్య పెట్టడం సరికాదని భావించి టీకా ఉత్పత్తి సామర్థ్యాలు, అందుబాటులోకి ఎప్పుడు వస్తాయి అన్న విషయాలను శుక్రవారం వివరంగా చెప్పుకొచ్చారు. ఆయన చెప్పినది అక్షరాల సత్యం. ప్రస్తుతం దేశంలో కోవి షీల్డ్, కో వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో రెండు నెలల్లో రష్యాలో తయారైనా స్పుత్నిక్ వి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రతి నెల 7 కోట్లు టీకాలు మాత్రమే భారత్ బయోటెక్ తో పాటు, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తయారవుతున్నాయి.
Also Read : సీబీఐ కస్టడీకి బొల్లినేని గాంధీ.. వెలుగులోకి రానున్న వందల కోట్ల ఆస్తులు
దేశంలో 45 ఏళ్లు దాటిన వారికి ఇంకా వ్యాక్సినేషన్ పూర్తి కాలేదు. వారికి పూర్తయిన తర్వాతే, అంటే రెండు డోసులు వేసిన తర్వాతే 18 ఏళ్లు నిండిన వారి వంతు కు వస్తుంది. 45 ఏళ్లు నిండి ఒక డోస్ వేసుకున్న వారికి సమయంలోగా రెండో డోస్ అందించకపోతే అది నిష్ప్రయోజనం గా మారుతుంది. అంటే వారికి రెండు డోసులు వేసిన తర్వాతే 18 ఏళ్లు నిండిన వారికి టీకా వేసేందుకు అవకాశం ఉంది. ఇదే విషయాన్ని వైయస్ జగన్ విడమరిచి చెబితే దానిని ప్రచురించాల్సిందిపోయి ఆంధ్రజ్యోతి కొత్త భాష్యాలు వెతుక్కుంది. ఆరోగ్య విపత్తులో రాష్ట్రం అల్లకల్లోలం అవుతున్న వేళ ప్రజలకు నికార్సైన జర్నలిజాన్ని అందించాల్సిన ఆంధ్రజ్యోతి, ప్రభుత్వం మీద లేనిపోని నిందలు వేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.
ఆంధ్రజ్యోతి చెప్పినట్లు 1600 కోట్లు వ్యాక్సిన్ మీద వెచ్చించడం ప్రభుత్వానికి పెద్ద విషయం ఏమీ కాదు. క్యాలండర్ పేరిట అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కేటాయించే నిధులలో 1600 కోట్ల రూపాయలు చాలా చిన్న మొత్తం. ఒకపక్క విపత్తు సమయంలో సైతం సంక్షేమ పథకాలను పక్కాగా అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు ఆరోగ్య భరోసా కల్పిస్తూ తగినన్ని పడకలు సిద్ధం చేస్తోంది. కరోనా నియంత్రణకు వైద్యానికి తగినంత ప్రాధాన్యం ఇస్తోంది. ఈ సమయంలో కీలకమైన వ్యాక్సినేషన్ కు 1600 కోట్లు డబ్బు వెచ్చించడం పెద్ద విషయం కాకపోయినా, ప్రభుత్వం పై బురదజల్లేలా ఆంధ్రజ్యోతి రాసుకు రావడం ఆంధ్రజ్యోతి నైజాన్ని తెలియజేస్తోంది.
మరో వైపు 12వ పేజీలో టీకాల్లేవ్ శీర్షికన దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉందని, 18 ఏళ్లపైబడిన వారికి వ్యాక్సిన్లు వేసేందుకు డోసులు లేక రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తివేశాయని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. 45 ఏళ్లు పైబడిన వారికి నత్తనడకన వ్యాక్సినేషన్ జరుగుతోందని పేర్కొంది. మరి మొదటి పేజీలోనేమో జగన్ సర్కార్‌పై బురదజల్లేలా.. ఉత్పత్తి సంస్థల వద్ద టీకాలు ఉన్నా.. కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదంటూ బ్యానర్ కథనం రాసుకొచ్చిన ఆంధ్రజ్యోతి.. 12వ పేజీలో మాత్రం టీకాల్లేవ్ అంటూ వాస్తవ పరిస్థితిని వివరించింది. ఈ తరహా జర్నలిజంతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో గానీ.. ఆయన అనుకున్నది జరగకపోగా.. ఆంధ్రజ్యోతి నైజం, జర్నలిజంలోని డొల్లతనం బయటపడుతుంది.
Also Read : ఉన్నది ఉన్నట్లు.. జగన్ చేయలేదు కనికట్టు