iDreamPost
android-app
ios-app

మత్తు డాక్టర్‌ సుధాకర్‌ డిశ్చార్జికి హైకోర్టు ఆదేశం

మత్తు డాక్టర్‌ సుధాకర్‌ డిశ్చార్జికి హైకోర్టు ఆదేశం

విశాఖ మత్తు డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం రోజుకో మలుపుతిరుగుతోంది. తాజాగా ఈ రోజు ఆయనని మానసిక చికిత్స ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రి సూపరిండెంటెండ్‌కు సమాచారం ఇచ్చి సుధాకర్‌ ఎప్పుడైనా డిశ్చార్జికి కావచ్చని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ఆయన తల్లి దాఖలు చేసిన హెబియస్‌కార్పస్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

మరో వైపు సుధాకర్‌ వ్యవహారంలో సీబీఐ విచారణ కొనసాగుతోంది. అటు విశాఖ పోలీసులు, ఇటు డాక్టర్‌ సుధాకర్‌లపై కేసులు నమోదు చేసిన సీబీఐ వేగంగ దర్యాప్తు చేస్తోంది. మాస్కులు ఇవ్వలేదని గత నెలలో సుధాకర్‌ నర్సిపట్నం మున్సిపల్‌ కార్యాలయంలో హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఆయనపై సస్పెన్సన్‌ వేటు పడింది. ఆ తర్వాత మద్యం మత్తులో రోడ్డుపై ప్రధాని, ముఖ్యమంత్రులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ, ఆయన మానసిక ప్రవర్తనలే తేడా ఉండడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. సుధాకర్‌ను పోలీసులు కొట్టారంటూ, దీనిపై విచారణ జరిపించాలని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రాసిన లేఖను సుమోటోగా తీసుకున్న హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.

పోలీసులపై సీబీఐ విచారణ జరుగుతుందని భావించి లేఖ రాసిన అనితకు, డాక్టర్‌ సుధాకర్‌కు సీబీఐ పెద్ద ట్విస్ట్‌ ఇచ్చింది. పోలీసులతోపాటు సుధాకర్‌పై కూడా కేసు నమోదు చేసిన సీబీఐ సుధాకర్‌కు షాక్‌ ఇచ్చింది. మొత్తంగా ఈ వ్యవహారంలో ఇరువైపుల విచారణ చేస్తున్న సీబీఐ త్వరలోనే చార్జిషీట్‌ దాఖలు చేసే అవకాశం ఉంది.