iDreamPost
android-app
ios-app

సీఆర్డీఏ రద్దు.. ఎఎంఆర్డీఏ ఏర్పాటు..

సీఆర్డీఏ రద్దు.. ఎఎంఆర్డీఏ ఏర్పాటు..

ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో హైపర్ కమిటీ నివేదికను ప్రభుత్వం ఆమోదించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అధికార వికేంధ్రీకరణ బిల్లుతో పాటు అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ బిల్లుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానంగా ఈ మంత్రివర్గ భేటీలో తీసుకున్న నిర్ణయాలు చూస్తే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, ఎండాకాలం సమావేశాలు ఈ మూడు సెషన్స్ ను ఎప్పటిలాగే అమరావతిలోనే కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే ఇప్పటివరకు అమరావతిలో కొనసాగుతున్న హైకోర్టు ని కర్నూల్ లో ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించి అమరావతి నుండి హైకోర్టు ని కర్నూల్ కి తరలించే ప్రక్రియకు వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని కేబినెట్ భేటీ నిర్ణయించింది.

Read Also: ఏపీ కేబినెట్‌ తీర్మానాలు ఇవే..

అధికార వికేంధ్రీకరణలో భాగంగా ఇప్పటివరకు అమరావతిలో కొనసాగుతున్న సచివాలయం, అన్ని శాఖలకు సంబందించిన కార్యాలయాలు అన్ని శాఖాధిపతుల కార్యాలయాలతో పాటు, రాజ్ భవన్ ని విశాఖ కి తరలించడానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇక రాజధాని రైతులకి మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా సీఆర్డీఏ కి భూములిచ్చిన రైతులందరికీ ఇస్తున్న వార్షిక కౌలు ను పది సంవత్సరాలనుండి పదిహేను సంవత్సరాలకి పెంచాలని నిర్ణయించింది. అలాగే రాజధానికి భూములిచ్చిన రైతులకి మెరుగైన ప్యాకేజ్ లో భాగంగా 11 వేల రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇదే సమయంలో సీఆర్డీఏ బిల్లు ఉపసంహరణ, అధికార వికేంధ్రీకరణ బిల్లులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అధారిటీ (ఎఎంఆర్డీఏ) ని కొత్తగా ఏర్పాటు చెయ్యాలని కేబినెట్ మరొక కీలకమైన నిర్ణయం తీసుకుంది.

Read Also: ముగిసిన బీఏసీ సమావేశం.. అజెండా ఇదే..

ఇక ఇన్ సైడ్ ట్రేడింగ్ కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగినట్టు ప్రాధమిక సాక్ష్యాలు లభించడంతో దానిపై ఇప్పటికే ప్రాధమిక విచారణ చేపట్టిన మంత్రి వర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ మొత్తం వ్యవహారం మీద లోకాయుక్తా విచారణ జరిపించాలని క్యాబినెట్ నిర్ణయించింది. కొత్తగా పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీని ఏర్పాటు చెయ్యాలని మంత్రివర్గం నిర్ణయించింది.