iDreamPost
android-app
ios-app

అమరావతికి.. ఆ ఒక్క మార్గమే మిగిలింది..

అమరావతికి.. ఆ ఒక్క మార్గమే మిగిలింది..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా ఒక్క అమరావతే ఉండాలని ఉద్యమాలు చేస్తున్న వారికి రాజకీయంగా ఉన్న ఒక్క అవకాశం కూడా మూసుకుపోయింది. కేంద్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని అడ్డుకుంటుందని చెబుతున్న నేతలకు, ఆ ఆశతో ఉన్న అమరావతిలోని కొన్ని గ్రామాల రైతులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ క్లారిటీ ఇచ్చారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదంటూ.. రాష్ట్రంలో రాజధాని ఎక్కడైనా పెట్టుకోవచ్చని కుండబద్ధలు కొట్టారు.

దాదాపు 50 రోజులుగా నిరసనలు, ఉద్యమాలు, ఆపై చివరకు సోమ, మంగళవారం జాతీయ స్థాయి నేతలను కలవడం వరకు.. ఇలా టీడీపీ, అమరావతి జేఏసీ చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. జాతీయ పత్రికల్లో అనుకూల కథనాలు, తెలుగు పత్రికల్లో జాతీయ స్థాయి జర్నలిస్టులతో ప్రత్యేక వ్యాసాలు.. ఇన్ని చేసినా రాష్ట్ర సమతుల అభివృద్ధికే మూడు రాజధానులంటూ జగన్‌ సర్కార్‌ ముందుకు సాగుతోంది. ఇక టీడీపీ, అమరావతి జేఏసీ.. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలనుకునే వారు పోరాడేందుకు ఒకే ఒక్క మార్గం మిగిలింది.

Read Also: మీ రాజధాని మీ ఇష్టం – కేంద్ర హోమ్ మంత్రి

చట్టపరమైన అంశాల ఆధారంగా న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయడమనే మార్గం మాత్రమే అమరావతి కావాలనుకునే నేతలకు, ఉద్యమకారులకు ఉంది. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు ప్రభుత్వం ఇచ్చిన జీవోపై ఇప్పటికే పలువురు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అంతేకాకుండా అమరావతే రాజధానిగా కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నాయి. ఈ నెల 26వ తేదీ వరకు కార్యాలయాల తరలింపుపై తదుపరి చర్యలు ఏమీ తీసుకోవద్దంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ పిటిషన్లపై ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదనే చెప్పవచ్చు.

రాష్ట్ర న్యాయస్థానంలో అమరావతి జేఏసీ పిటిషన్లు దాఖలు చేయడం.. ప్రభుత్వం కౌంటర్‌ పిటిషన్లు సమర్పించడం.. ఇలా కొద్ది రోజులపాటు వాదనలు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏదో ఒక విషయం హైకోర్టు తేల్చేస్తుంది. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పిన నేపథ్యంలో హైకోర్టులో ప్రభుత్వానికే అనుకూలమైన తీర్పు రావచ్చు. ఒక వేళ ఇలా వచ్చినా.. అమరావతి జేఏసీ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంది. సుప్రిం కోర్టులోనూ పలు పిటిషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద.. ఇప్పటి వరకు రాజకీయపరంగా సాగిన అమరావతి ఉద్యమం.. ఇకపై న్యాయస్థానాల్లో సాగుతుందనడంలో సందేహం లేదు.