iDreamPost
android-app
ios-app

రాష్ట్రాల హ‌క్కులను కాలరాయ‌డం స‌రికాదు. ఆంప‌న్ తుఫాన్‌ని జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాలి

రాష్ట్రాల హ‌క్కులను కాలరాయ‌డం స‌రికాదు. ఆంప‌న్ తుఫాన్‌ని జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాలి

22 ప్ర‌తిప‌క్ష పార్టీల విడియో కాన్ఫ‌రెన్స్ భేటీ

యావ‌త్ ప్ర‌పంచాన్నిగ‌జ‌గ‌జ‌లాడిస్తున్నకరోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు మోడీ స‌ర్కారు అనాలోచితంగా విధించిన లాక్‌డైన్‌ కారణంగా దేశ ప్ర‌జానీకం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. క‌రోనా వైరఎస్ విజృంభ‌ణ‌ వ‌ల్ల ఉత్ప‌న్నమైన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో కేంద్రం పూర్తిగా విఫ‌లమైంద‌ని విమ‌ర్శించాయి. రాష్ట్రాల హ‌క్కులను కాలరాయ‌డం స‌రికాదని మండిప‌డ్డాయి. ఆంప‌న్ తుఫాన్‌ని జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాలని డిమాండ్ చేశాయి.

కోవిద్‌-19 తో కుప్ప‌కూలిన దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ని గాడి పెట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్యాకేజీ ఒక నిర్ద‌య‌పూరిత పరిహాసం(క్రుయ‌ల్ జోక్‌)గా ప్ర‌తిప‌క్షాలు అభివ‌ర్ణించాయి. ప్రధాని మోడీ ప్రకటించిన ప్యాకేజీ, రోజుకొక్కటి చొప్పున కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామన్ వెల్ల‌డించిన‌ ప్యాకేజీ వివరాలు దేశ ఆర్ధిక వ్యవస్థని నిల‌బెట్టేందుకు ఎలాంటి భ‌రోసా ఇవ్వ‌లేక‌పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాయి. కరోనా కట్టడికి మోడీ స‌ర్కారు తీసుకున్న చర్యలు, లాక్‌డౌన్ పర్యావసానాలపై గురువారం సోనియాగాంధీ దేశంలోని ప్రతిపక్ష పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ స‌మావేశం నిర్వహించారు. తొలుత ఆంప‌న్ తుఫాన్ సృష్టించిన విధ్వంసంతో బ‌లైన 80 మందికి ప్ర‌తిప‌క్ష నేత‌లు నివాళి అర్పించారు. బాధిత కుటుంబాల‌ను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆదుకోవాల‌ని డిమాండ్ చేశాయి.

కేంద్రీకృత అధికారం… ఫెడ‌ర‌లిజానికి తూట్లు

రాష్ట్రాల హక్కులు హరించేలా కేంద్రం పెత్తనం, సంక్షోభ సమయంలో రాష్ట్రాలను ఆదుకోకపోవడంపై ప్ర‌తిప‌క్ష పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. జీఎస్టీ పెండింగ్ నిధులు విడుద‌ల చేయక పోవ‌‌డంపై ధ్వ‌జ‌మెత్తాయి. పీఎంఓ కేంద్రంగా అధికారమంతా కేంద్రీకృతం కావ‌డం ప్రతిప‌క్ష పార్టీలు మండిప‌డ్డాయి. వలస కూలీల సంక్షోభం కూడా కేంద్ర ఫ్ర‌భుత్వం రాష్ట్రాల‌పైనే భారం మోపింద‌ని మండిప‌డ్డాయి. కరోనా వైరఎస్‌ని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొవ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌లమైంద‌ని… రాష్ట్రాలే అద్భుత పాత్ర పోషించాయ‌ని అన్నాయి. ఈ అంశాల‌పై రానున్న రోజుల్లో భౌతిక ప‌రిస్థితుల‌కి అనుగుణంగా ఉద్య‌మిస్తామ‌ని హాజ‌రైన రాజ‌కీయ ప‌క్షాలు నిర్ణ‌యించాయి.

అనంత‌రం సోనియా గాంధీ స‌మావేశంలో మాట్లాడుతూ ఎటువంటి ప్రణాళికా లేకుండా విధించిన లాక్‌డౌక్‌ కారణంగా దేశం సంక్షోభంలోకి వెళ్లిందని వారంతా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పేద ప్ర‌జానీకం, వ‌ల‌స కార్మికులు ఈ అనిశ్చిత ప‌రిణామాల వ‌ల్ల‌ చాలా కష్టాలు పడ్డారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గుర్తు చేశారు. అయితే అసంఘటిత కార్మికులతోపాటు సాధారణ ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, కిరాణా షాపుల ఓనర్లను ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం లాక్‌డౌన్‌ను సాకుగా చూపించి అత్యంత పాశ‌వికంగా విధానప‌ర నిర్ణ‌యాలు తీసుకుంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

ప్యాకేజీ పేరిట‌ సంస్కరణలను తెర‌పైకి తీసుకొచ్చి, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి ఒడిగ‌ట్టడం దారుణం అన్నారు. శ్ర‌మ‌జీవులు, కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చ‌ట్టాల‌ను పెట్టుబ‌డిదారులను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ర‌ద్దు చేయ‌డం బాధాక‌రం అని సీపీఐ నేత డీ రాజా అన్నారు. ముందుగా 21 రోజుల్లోనే లాక్‌డౌన్‌ ముగుస్తుందని ప్రధాని మోడీ చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు వ్యాక్సిన్‌ వచ్చేంతవరకు వైరస్ పోదని అవ‌గ‌తమ‌వుతుంద‌న్నారు. లాక్‌డౌన్‌ విధింపుకు సంబంధించి గానీ, ఎగ్జిట్‌ ప్లాన్‌కు సంబంధించిగానీ ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదని సోనియా గాంధీ ధ్వ‌జ‌మెత్తారు. భేటీలో ప‌శ్చిమ బెంగాల్ సీఎం మమ‌తా బెన‌ర్జీ మాట్లాడుతూ ఆంప‌న్ తుపానుని కేంద్రం ప్ర‌భుత్వ జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. దాంతోపాటు, తుపాను త‌ర్వాత పున‌రావాస చ‌ర్య‌లు, ప‌రిస్థితిని ఎదుర్కొనేందుకు రూ. వెయ్యి కోట్లు కేటాయించాల‌ని కోరారు.

కాగా, ఈ స‌మావేశానికి ఈ భేటీకి సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నాయ‌కుడు డీ రాజా, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే, ప్ర‌ధాని దేవేగౌడ‌(జేడీయూ), శ‌ర‌ద్ ప‌వార్, ప్ర‌ఫుల్ ప‌టేల్‌ (ఎన్‌సీపీ), ఎంకే స్టాలిన్ (డీఎంకే), హేమంత్ సోరేన్ (జేఎంఎం), తేజ‌స్వీ యాద‌వ్ (ఆర్జేడీ), ఎన్‌కే ప్రేమ‌చంద్ర‌న్ (ఆర్ఎస్సీ), దొరైస్వామి రాజా(సీపీఐ), ప్రొ కోదండ‌రామ్ (తెలంగాణ జ‌న స‌మితి) త‌దిత‌ర పార్టీల నేతలు పాల్గొన‌గా, ఆమాద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హాజ‌రుకాలేదు.

తొలిసారి ప్రతిపక్ష భేటీ ఎన్‌డీఏ పాత మిత్ర‌ప‌క్షం శివసేన
అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీ, మోడీ స‌ర్కార్ ఒంటెత్తు పోక‌డ‌ల‌పై చ‌ర్చించేందుకు స‌మావేశ‌మైన ప్ర‌తిప‌క్ష పార్టీల స‌మావేశానికి తొలిసారి ఎన్డీఏ పాత మిత్ర‌ప‌క్షం శివ‌సేన స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయింది. దాదాపు 35 ఏండ్లుగా బీజేపీ మిత్రపక్షంగా కొనసాగిన శివసేన కూడా మొదటిసారి ప్రతిపక్ష పార్టీల సమావేశంలో పాల్గొని త‌న అభిప్రాయాలు వెల్ల‌డించింది. ఆ పార్టీ చీఫ్, మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే ప్ర‌తిప‌క్ష పార్టీ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొని కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌పై మండిప‌డ్డారు. వ‌ల‌స కార్మికుల వ్య‌వ‌హారంలో కేంద్ర ప్ర‌భుత్వం ముందు నుంచి ప్రేక్ష‌క పాత్ర పోషించింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.