iDreamPost
android-app
ios-app

సీఎం జగన్‌కు అమిత్ షా ఫోన్

సీఎం జగన్‌కు అమిత్ షా ఫోన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. కరోనా వైరస్ కట్టడి చర్యలు, లాక్ డౌన్ అమలు, లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను అమిత్ షాకు వివరించారు. ప్రతి పది లక్షల మంది జనాభాకు గరిష్ట శాతం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎం వివరించారు. వాలంటీర్ల ద్వారా సేకరించిన సమాచారం మేరకు కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా రెడ్ జోన్లు, హాట్ స్పాట్ లు, కంటైన్మెంట్ ఏరియాలలో లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు వివరించారు.

రేపు సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల సీఎం లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. లాక్ డౌన్ అమలు, కరోనా కట్టడి చర్యలపై చర్చించనున్నారు. మే 3 న లాక్ డౌన్ పొడిగింపు గడువు ముగియనుండడంతో ఆ విషయంపై ప్రధానంగా చర్చించనున్నారు. కరోనా నియంత్రణ లోకి రాకపోవడం తో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించే యోచనలో ఉన్నాయి. మరి కొన్ని రాష్ట్రాలు రెడ్ జోన్ లలో మాత్రమే లాక్ డౌన్ కొనసాగించాలని ఆలోచిస్తున్నాయి.

కాగా, రాష్ట్రంలో కొత్తగా 81 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 1,097 చేరిందని పేర్కొంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా 31 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 835 మందికి చికిత్స చేస్తున్నట్లు వెల్లడించింది. 231 వైరస్ నుంచి కొలుకున్నారని వెల్లడించింది. కొత్తగా నమోదైన 81 కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 52 నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 12, కర్నూలు జిల్లాలో నాలుగు గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలో మూడు కేసులు చొప్పున, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలో రెండు చొప్పున నమోదయ్యాయి.