iDreamPost
iDreamPost
కరోనా వైరస్ కాటుకు యావత్ ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ఈ దేశం ఆదేశం అని తేడా లేకుండా చివరకు అగ్రరాజ్యమైన అమెరికా కూడా అల్లాడిపోతోంది. సరే వైరస్ దెబ్బకు అమెరికా తల్లడిల్లిపోతున్న సమయంలో నే అగ్రరాజ్యంలో ఉంటున్న మరో 3.5 కోట్లమందికి మరోరకమైన ప్రమాదం కూడా పొంచి ఉన్నట్లు సమాచారం.
అదేమిటంటే ఉద్యోగ, ఉపాధిని కోల్పోవటం. ఓ అంచనా ప్రకారం కరోనా వైరస్ కారణంగా తొందరలోనే 3.5 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధిని కోల్పోవటం ఖాయమని అర్ధమవుతోంది.
వైరస్ దెబ్బకు అమెరికాలోని చాలా రంగాలు దాదాపు కుదేలైపోయాయి. పర్యాటక రంగంతో పాటు ఐటి రంగం, పారిశ్రామిక రంగం, ఫార్మా, ఉత్పత్తితో పాటు సేవల రంగం కూడా దారుణంగా దెబ్బతిన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. పై రంగాల్లో పనిచేస్తున్న వారు ఎక్కువగా విదేశీయులే అని చెప్పాలి. విదేశీయుల్లో కూడా ప్రధానంగా చైనా, ఇండియా నుండే చాలా ఎక్కువగా ఉన్నారట.
రోజుల తరబడి పై రంగాలు మూతపడటమే కాకుండా తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా ఎవరూ చెప్పలేకున్నారు. మూత పడటం వల్ల పై రంగాల నుండి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నది వాస్తవం. మళ్ళీ ఎప్పుడు తెరుచుకున్నా జరిగిన నష్టాలను భర్తీ చేసుకోవటమైతే ఇప్పట్లో సాధ్యం కాదు. అందుకనే ముందు ఉద్యోగులను తీసేసేందుకే యజమాన్యాలు నిర్ణయించుకుంటాయి. దాంతో తక్కువలో తక్కువ 1.5 కోటిమంది ఉద్యోగాలు కోల్పోవటం ఖాయమని తెలుస్తోంది.
అమెరికాలోని న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూ జెర్సీ, హవానా, నార్త్ కరోలినా, వాషింగ్టన్ డిసి రాష్ట్రాలు కరోనా వైరస్ కాటుకు విలవిల్లాడిపోతున్నాయి. ఐటి కంపెనీలు, సేవల రంగాలు, టూరిజం రంగాలకు చెందిన వాళ్ళు కూడా పై రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నారట. కాబట్టి కరోనా వైరస్ ఇటు ప్రాణాలు తీయటమే కాకుండా అటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా ఎంతగా దెబ్బ తీస్తోందో అర్ధమైపోతోంది.