iDreamPost
iDreamPost
అమెరికాలో మహావిపత్తు కంటిన్యు అవుతోంది. మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికాలో గంటకు 83 మంది చనిపోతున్నారు. వైరస్ వ్యాప్తి, పెరిగిపోతున్న రోగులు, వ్యాప్తి నిరోధాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించాడు. నిజానికి ఈ పనిని ట్రంప్ ఎప్పుడో చేసుండాల్సింది. నిర్ణయం తీసుకోవటంలో ఆలస్యం అవటం వల్లే అమెరికాలో పరిస్ధితిలు ఇంత భయంకరంగా దిగజారిపోయిందనే చెప్పాలి.
తాను విధించిన నేషనల్ ఎమర్జెన్సీ యావత్ దేశంలో వెంటనే అమల్లోకి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశాడు. ఎందుకిలా చేయాల్సొచ్చిందంటే రెండు వారాల క్రితం వరకు కూడా అమెరికా మొత్తం మీద లాక్ డౌన్ అని ట్రంప్ ప్రకటిస్తే రాష్ట్రాల గవర్నర్లు అంగీకరించలేదు. అలాగే గవర్నర్లు చేసిన సూచనలను ట్రంప్ పట్టించుకోలేదు. అంటే రాజకీయంగా వీరిమధ్య ఉన్న వైరుధ్యాల వల్ల చివరకు ప్రజలు భారీ మూల్యం చెల్లించాల్సొచ్చింది.
తాజా సమచారం ప్రకారం అమెరికా మొత్తం మీద 5.5 లక్షల మంది బాధితులుంటే సుమారు 21. 437 మంది మరణించారు. అమెరికా చరిత్రలోనే ఇంతటి మహావిపత్తు ఎప్పుడూ రికార్డు కాలేదు. కంటికి కనబడని శతృవు వైరస్ రూపంలో దాడి చేస్తుండటంతో అగ్రరాజ్యమైనప్పటికీ అమెరికా పాలకులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. వైద్యం లేని సమస్య కావటంతో ముందు జాగ్రత్త ఒక్కటే నివారణ అన్న ఆలోచనతోనే ట్రంప్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించాడు.
అమెరికాలో ప్రస్తుత పరిస్ధితిని దృష్టిలో పెట్టుకునే 50 రాష్ట్రాల గవర్నర్లు కూడా నేషనల్ ఎమర్జెన్సీని ఆమోదించారు. దేశం మొత్తం మీద న్యూయార్క్, న్యూజెర్సీల్లోనే బాధితులు, మరణాల సంఖ్య బాగా ఎక్కువుంది. కాబట్టి పై రాష్ట్రాల్లోనే ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. సరే ఇదే సమయంలో అమెరికాలో ప్రస్తుత విపత్తుకు ట్రంప్ ఒంటెత్తు పోకడలే కారణమని న్యూయార్క్ టైమ్స్ కూడా తీవ్రమైన ఆరోపణలు చేయటం మరో దుమారానికి తెరలేపింది. సంక్షోభ సమయంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు కాకుండా ముందు వైరస్ ను కట్టడి చేయటమే అందరు కోరుకుంటున్నది.