Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, మూడు రాజధానుల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో జరగుతున్న ఉద్యమం నేడు గురువారంతో 100 రోజులకు చేరుకుంది. అమరావతి ప్రాంతంలోని వెలగపూడి, తుళ్లూరు, ఉద్ధండరాయునిపాలెం తదితర గ్రామాల్లోని రైతులు ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు. తాము అమరావతి రాజధానికి భూములిచ్చామని, ఇప్పుడు మూడు రాజధానులు పెడితే.. తమకు అన్యాయం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తున్నా రైతులు తమ ఆందోళనలను విరమించలేదు. అయితే గతంలోలాగా ఎక్కువ మంది కాకుండా.. షిఫ్టుల వారీగా తక్కువ మంది టెంట్లలో కూర్చుంటున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ దూరం దూరంగా కూర్చుంటున్నారు.
వంద రోజుల ఉద్యమంలో రైతులు, మహిళలు తమ నిరసనలను వివిధ రూపాల్లో వ్యక్తం చేశారు. వంటా వార్పు, ర్యాలీలు, బైక్ ర్యాలీలు, దేవుళ్లకు నైవేధ్యాలు, ఆ దారిని వచ్చిపోయే సచివాలయ ఉద్యోగులు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులకు వినతిపత్రాలు ఇవ్వడం.. తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
ఉద్యమాన్ని కొనసాగించేందుకు అమరావతి జేఏసీ ని ఏర్పాటు చేశారు. దీని కోసం భారీగా విరాళాలు సేకరించారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఈ విరాళాల సేకరణలో కీలక భూమిక పోషించారు. తన భార్య భువనేశ్వరి చేతి గాజులను మొదటి విరాళంగా ఇప్పించారు. ఆ తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జోలె పట్టుకుని తిరిగి విరాళాలు సేకరించారు. అమరావతి జేఏసీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంలోని పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇలా పలు రూపాల్లో ఉద్యమం కొనసాగిస్తున్నారు.