iDreamPost
android-app
ios-app

ఆయన లెక్క చెప్పాడు.. ఈయన ఎక్కడున్నాయో తెలియదంటున్నాడు..

ఆయన లెక్క చెప్పాడు.. ఈయన ఎక్కడున్నాయో తెలియదంటున్నాడు..

రాజధాని అమరావతి నిర్మాణం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం సేకరించిన విరాళాల లెక్క తేలింది. అమరావతి నిర్మాణం కోసం 57 కోట్ల రూపాయాలు ప్రజలు విరాళంగా ఇచ్చారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అమరావతి పరిరక్షణ పోరాటం ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ఈ విషయం మొదటిసారిగా ప్రస్తావించారు.

వివిధ రూపాల్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసమంటూ విరాళాలు సేకరించింది. అమరావతి బ్రిక్స్‌ పేరుతో ఆన్‌లైన్‌లో ఇటుకల విక్రయాలు, ఎన్నారైలు విరాళాలు, సచివాలయంలో హుండీలు ఏర్పాటు, పాఠశాలల్లో విద్యార్థుల నుంచి, కొంత మంది ఉద్యోగులు తమ జీతాల్లో కొంత భాగం.. ఇలా అనేక రూపాల్లో అమరావతి నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు ఇది మరుగునపడిన విషయం.

మూడు రాజధానుల ప్రతిపాదన ప్రభుత్వం నుంచి రావడం, ఒకే రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ చంద్రబాబు నిరసనలు, అమరావతి పరిరక్షణ జేఏసీ ఏర్పాటు.. దానికి విరాళం అంటూ చంద్రబాబు భార్య భువనేశ్వరి చేతి గాజులు ఇవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా జోలె పట్టి విరాళాలు సేకరిస్తుండడంతో.. అమరావతి నిర్మాణం అంటూ అప్పట్లో చంద్రబాబు సేకరించిన విరాళాల అంశం మళ్లీ ప్రస్తావనకు వచ్చింది.

అమరావతి పరిరక్షణ ఉద్యమానికి చంద్రబాబు విరాళాలు సేకరిస్తున్న సమయంలో.. అప్పట్లో రాజధాని నిర్మాణం కోసం సేకరించిన విరాళాలు ఎమయ్యాయంటూ ప్రజలు చర్చించుకుంటున్న తరుణంలో టీడీపీ అనుకూల పత్రిక అనే ముద్ర ఉన్న ఆంధ్రజ్యోతి ప్రజల తరఫున విరాళాలపై ప్రశ్నలు సంధించింది.

అమరావతికి దిక్కేది..? విరాళాలకు విలువేది..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అమరావతి కోసం సై అంటూ మరోసారి ఆడపడుచులు ఆభరణాలు ఇస్తున్నారు. అయితే రాజధానికి మేము సైతం అంటూ నాడు దాతలిచ్చిన విరాళాలకు దిక్కెవరు..? కేపిటల్‌ కట్టేందుకు ఆన్‌లైన్‌లో ఇటుకలు ఇచ్చిన వారికి సమాధానం చెప్పేదెవరు..? అమరావతి విరాళాలలకు లెక్క ఎవరు చెబుతారు..? అంటూ ఇటీవల ఆంధ్రజ్యోతి ప్రజల మనసులోని నెలకొన్న సందేహాలకు అక్షర రూపం ఇచ్చింది. ఆన్‌లైన్‌లో తమ భావాలు, ప్రశ్నలు సంధించొచ్చని వేదిక కల్పించింది. ఈ నేపథ్యంలో తొలిసారి చంద్రబాబు అప్పట్లో అమరావతి కోసం సేకరించిన విరాళాల లెక్క చెప్పడం గమనార్హం.

అమరావతి విరాళాల లెక్క చెప్పిన చంద్రబాబు ఓ క్లారిటీ ఇవ్వగా.. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాటలు సరికొత్త సందిగ్ధతను తెచ్చిపెట్టాయి. అమరావతి కోసం సేకరించిన విరాళాలు ఏక్కడున్నాయో తెలియదంటూ ఆయన బాంబు పేల్చారు. 57 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయని చెప్పి చంద్రబాబు ఈ అంశంపై ప్రజలకు స్పష్టత ఇచ్చారనుకుంటున్న సందర్భంలో మంత్రి కన్నబాబు మాటలతో ఇప్పుడు ఆ నిధులు ఏమయ్యాయన్న ఒకే ఒక ప్రశ్న ప్రజల మొదళ్లను తొలుస్తోంది.

ప్రభుత్వం అధికారికంగానే అప్పట్లో విరాళాలు సేకరిచింది. ఈ మొత్తాలు దేనికి ఖర్చు చేశారు..? ఖర్చు చేయకపోతే ఆ మొత్తం ఎక్కడ ఉంది..? అన్న విషయాలు ప్రభుత్వాలు మారినా సమాచారం మాత్రం ఉంటుంది. కానీ మంత్రి కన్న బాబు అమరావతి కోసం సేకరించిన విరాళాలు ఎక్కడున్నాయో తెలియదనడంతో అసలు అప్పట్లో సేకరించిన విరాళాలు ఎక్కడున్నాయి..? ప్రభుత్వం వద్ద లేకపోతే టీడీపీ వద్ద ఉన్నాయా..? లేక వ్యక్తుల వద్ద ఉన్నాయా..? అన్నది తేలాల్సి ఉంది. మొత్తం విరాళాల లెక్క తేలడంతో ఈ మొత్తం ఎక్కడ…? ఏ రూపంలో ఉన్నది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.