iDreamPost
iDreamPost
ఈ ఏడాది తొలి ఇండస్ట్రీ హిట్ గా రికార్డులు నమోదు చేసుకున్న అల వైకుంఠ పురములో డిజిటల్ టెలికాస్ట్ అర్ధరాత్రి నుంచి మొదలైపోయింది. మొన్న 26నే వస్తుందని ప్రకటించి వాయిదా వేయడం పట్ల నెటిజన్లు భగ్గుమన్నారు. ఈ సినిమా కోసమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్లకు ఇది మరింత ఆగ్రహం కలిగించింది. మరి దానికి తలొగ్గారో లేక సాంకేతిక సమస్య వల్ల ఆలస్యమయ్యిందో తెలియదు కానీ మొత్తానికి 27 నుంచి సన్ నెక్స్ట్ యాప్ లో అల వైకుంఠపురములో అందుబాటులోకి వచ్చేసింది.
టీవీ టెలికాస్ట్ కన్నా చాలా ముందు ఆన్ లైన్ కి వచ్చిన అల వైకుంఠపురములోకు భారీ వ్యూస్ దక్కే అవకాశం ఉంది. తేదీ మారడం గురించి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా హఠాత్తుగా విడుదల చేయడం ఆశ్చర్యకరమే. ప్రస్తుతం 50 రోజుల వేడుకకు అతి దగ్గరలో ఉన్న అల వైకుంఠపురములో కలెక్షన్ల మీద దీని ప్రభావం ఉండే అవకాశాలు లేకపోలేదు. వీకెండ్లో ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతున్న ఈ మూవీని ఇంత త్వరగా ఆన్ లైన్ లో వదలడం గురించి అభిమానులు కొంత అసంతృప్తిగా ఉన్నా థియేటర్ కు మళ్ళీ వెళ్లకుండా ఇంట్లోనే చూసే ఛాన్స్ దక్కడంతో మరోవైపు హ్యాపీగానే ఉన్నారు.
నాన్ బాహుబలి రికార్డులు ఇప్పటికే సొంతం చేసుకున్న అల వైకుంఠపురములో త్వరలో హిందీలో కూడా రీమేక్ కానుంది. సరిలేరు నీకెవ్వరు కన్నా ముందే నెట్టింట్లోకి వచ్చిన అల వైకుంఠపురములో చిన్ని తెరపై ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో వేచి చూడాలి. త్రివిక్రమ్ పనితనం, థమన్ సంగీతం ఈ సినిమా విజయంలో చాలా కీలక పాత్రలు వహించాయి. పూజా హెగ్డే గ్లామర్ తో పాటు మురళీశర్మ, జయరాం, టబు, సముతిరఖని పర్ఫార్మెన్సులు ఈ సినిమా విజయానికి దన్నుగా నిలిచాయి. మొత్తానికి కేవలం ఒక్క రోజు ఆలస్యంగా అల వైకుంఠపురములో డిజిటల్ వర్షన్ రావడం పట్ల సినిమా ప్రేమికులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.