iDreamPost
android-app
ios-app

Ala Vaikunthapurramloo : రంగంలోకి అల్లు అరవింద్ – రద్దుకు రాయబారం

  • Published Jan 21, 2022 | 7:17 AM Updated Updated Jan 21, 2022 | 7:17 AM
Ala Vaikunthapurramloo : రంగంలోకి అల్లు అరవింద్ – రద్దుకు రాయబారం

జనవరి 26న అల వైకుంఠపురములో హిందీ డబ్బింగ్ వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ కు సర్వం సిద్ధమయ్యింది. స్క్రీన్లు ఇంకా అలాట్ చేయలేదు కానీ ఈలోగా తెరవెనుక మరో తతంగం నడుస్తోందని తెలిసింది. ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ షెహజాదా ఆల్రెడీ ప్రొడక్షన్ లో ఉంది. ఇప్పుడు కనక ఈ డబ్బింగ్ బొమ్మ పుష్ప రేంజ్ లో ఆడేసిందంటే షెహజాదాకు పెద్ద దెబ్బ పడుతుంది. పైగా అల్లు అర్జున్ కి కార్తీక్ ఆర్యన్ కి నటనలో స్క్రీన్ ప్రెజెన్స్ లో కనక పోలిక వచ్చిందంటే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడా విడుదలను ఆపేందుకు అల్లు అరవింద్ స్వయంగా రంగంలోకి దిగినట్టు లేటెస్ట్ అప్ డేట్.

అల వైకుంఠపురములో డబ్బింగ్ హక్కులు ఉన్నవి గోల్డ్ మైన్స్ అధినేత మనీష్ షా దగ్గర. ఆయనేమో తగ్గేదేలే అంటున్నారట. ఒకవేళ విడుదల రద్దు చేయాలంటే భారీ మొత్తాన్ని ఆశించవచ్చని ముంబై టాక్. అది ఎంత ఉంటుందో చెప్పలేం. నిజానికి షెహజాదా శాటిలైట్ హక్కులు కొన్నది కూడా ఈయనే. ఇలాంటి డీలింగ్స్ తో షాకు అరవింద్ తో మంచి సంబంధం ఉంది. అలాంటప్పుడు ఈయన అడగ్గానే మనీష్ వెనక్కు తగ్గొచ్చు. కానీ అలాంటిది జరగలేదు. బాక్సాఫీస్ వద్ద ఏర్పడిన వ్యాక్యూమ్ ని పూర్తిగా వాడుకునేందుకు ఇంత కన్నా మంచి సమయం దొరకదని అందుకే పట్టుబట్టి రిలీజ్ చేయాలనే సంకల్పంతో ఉన్నట్టుగా చెబుతున్నారు.

మొత్తానికి అయిదు రోజులు ఉండగా ఇలాంటి పరిణామాలు జరగడం ఆసక్తి కలిగించే అంశమే. రిపబ్లిక్ డేకి హిందీలో ఒక్క సినిమా కూడా లేదు. ముంబై ఢిల్లీ పూణే కోల్కతా లాంటి నగరాల్లో థియేటర్ల పరిస్థితి అలో లక్ష్మణా అనేలా ఉంది. ఆల్రెడీ నెలకు పైగా ఆడిన సినిమాలకు కలెక్షన్లు లేక నానా యాతన పడుతున్నారు. ఈ క్రమంలో అల వైకుంఠపురములో హిందీ డబ్బింగ్ వాళ్ళకో గొప్ప అవకాశంగా కనిపించింది. ఈలోగా ఇప్పుడీ రాయబారాలు మొదలయ్యాయి. గోల్డ్ మైన్స్ మాత్రం అన్నీ పనులు పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంచుకుందట. ఒకవేళ అల్లు అరవింద్ రాయబారం కనక వర్కౌట్ అయితే అల వైకుంఠపురములో ఆగిపోతుంది. లేదా కష్టం.

Also Read : February Releases : ఫిబ్రవరి నుంచి బాక్సాఫీస్ జోష్