ముసుగుతో తీవ్రవాదుల ఆట కట్టు – Nostalgia

హీరో అజ్ఞాతంలో ఉంటూ బయటికి కనిపించకుండా విలన్ల భరతం పట్టే కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసినవి మాత్రం తక్కువే. 1996లో ‘భారతీయుడు’ విజయం కొత్త తరహా ఆలోచనలకు ఆజ్యం పోసింది. సమాజంలో తప్పులు, నేరాలు చేసినవాళ్లకు ఒక సామాన్యుడు అందులోనూ వృద్ధుడు శిక్షలు వేయడాన్ని జనం బ్రహ్మాండంగా ఆదరించారు. దాన్ని ఇంకో కోణంలో అలోచించి దర్శకుడు తిరుపతిస్వామి 2000 సంవత్సరంలో తీసిన చిత్రమే ఆజాద్. ఆసుపత్రుల్లో జరిగే దురాగతాలను 1998లో రిలీజైన వెంకటేష్ ‘గణేష్’తో అద్భుతంగా ఆవిష్కరించిన స్వామికి ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ నుచి పిలుపు వచ్చింది.

అంతకు ముందు సంవత్సరం ఆయన నాగార్జునతో తీసిన ‘రావోయి చందమామ’ ఫ్లాపయ్యింది. దానికి ముందు 1993లో తీసిన ‘గోవిందా గోవిందా’ కూడా అంతే. ఫస్ట్ కాంబోలో చేసిన ‘ఆఖరి పోరాటం’ ఒక్కటే కమర్షియల్ సక్సెస్. అందుకే ఈసారి ఎలాగైనా గట్టి హిట్టు కొట్టాలన్న టార్గెట్ తో సబ్జెక్టుని అడిగారు దత్తు. పల్లెటూరి నుంచి సిటీకి వచ్చిన ఓ అమాయక యువకుడు తనకు తెలియకుండానే ఒక జర్నలిస్ట్ వల్ల ఏకంగా పాకిస్థాన్ తీవ్రవాదిని మట్టుబెట్టే దాకా ఎలా వెళ్లాడనే పాయింట్ తో భూపతిరాజా, యండమూరి వీరేంద్రనాథ్, క్రేజీ మోహన్, ఫిరోజ్ భగత్, మహారాజన్ తదితరులంతా కలిసి ఈ స్క్రిప్ట్ కి ఒక రూపాన్ని ఇచ్చారు.

పరుచూరి బ్రదర్స్ సంభాషణలు, మణిశర్మ సంగీతం, చోట కె నాయుడు ఛాయాగ్రహణం వెరసి భారీ టీమ్ ని సెట్ చేసుకున్నారు. శిల్పశెట్టి, సౌందర్య హీరోయిన్లుగా కీలకమైన చెల్లి పాత్రలో సుజిత్ ఎంపికయ్యింది. శివ తర్వాత నాగ్ మూవీలో రఘువరన్ మెయిన్ విలన్ గా చేస్తున్నదన్న వార్త అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేసింది. బడ్జెట్ విషయంలో రాజీ పడలేదు. కొన్ని సన్నివేశాలు, డైలాగులు అద్భుతంగా వచ్చాయి. 2000 సెప్టెంబర్ 29న విడుదలైన ఆజాద్ కు అన్ని వర్గాల ప్రేక్షకులు ఓటేశారు. మరోసారి తిరుపతిస్వామి తన టేకింగ్ తో ఆకట్టుకున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇతను ఆ తర్వాత తమిళ్ లో విజయ్ కాంత్ తో సెల్యూట్ తీశాక యాక్సిడెంట్ లో చనిపోవడం విషాదకరం. లేకపోతే శంకర్ స్థాయిలో తిరుపతి స్వామి నుంచి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చేవి.

Show comments