iDreamPost
iDreamPost
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారు. ఏడాది జగన్ సర్కార్ పాలనలో గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అనేక ఆవిష్కరణలు చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా వివిధ వ్యవస్థలను నెలకొల్పారు. వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాల వ్యవస్థలతో ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లారు. దీంతో సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు ఇక్కట్లు తప్పాయి. నేరుగా ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి. గతంలో సంక్షేమ పథకం తమకు అందాలంటే…ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసల ఓర్చాల్సి వచ్చేంది. కానీ ఇప్పుడు అలా లేకుండా ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి.
అవ్వకు, అయ్యకు వచ్చే పెన్షన్‌ను సంబంధిత వాలంటీరే వారికి అందజేస్తున్నాడు. అంతేకాకుండా అనేక ఇతర సంక్షేమ పథకాల విషయంలో కూడా వాలంటీర్లే ప్రజల వద్దకు వెళ్లి వాటికి సంబంధించిన వివరాలను తెలుపుతున్నారు. గ్రామ సచివాలయంతో రాష్ట్ర ప్రభుత్వమే తమ గ్రామంలో ఉన్నట్లు ప్రజలు ఫీలవుతున్నారు. సచివాలయంలో వివిధ రంగాలకు చెందిన పది నుంచి పన్నెండు మంది ఉద్యోగులు ఉంటారు. వారంతా ఆయా రంగాలకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి…పనులు చేస్తారు. ముఖ్యమంత్రులెవ్వరూ చేయని విధంగా..వారెవ్వరికీ రాని ఆలోచన జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అదే ప్రజా సంక్షేమ పట్ల జగన్ చిత్త శుద్ధిని తెలుపుతుంది.
సరిగ్గా మళ్లీ ఇప్పుడు కూడా గ్రామీణాభివృద్ధికి సంబంధించిన వ్యవస్థ రూపకల్పనకు సిఎం జగన్మోహన్ రెడ్డి నాంది పలికారు. గ్రామాల్లో వ్యవసాయ ఎటిఎంలను నెలకొల్పేందుకు సిద్ధమయ్యారు. దీన్ని వినడానికి విచిత్రంగా ఉంది కదా. అవును దేశంలో మరెక్కడ లేని విధంగా ఈ వ్యవస్థను నెలకొల్పేందుకు సిఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈనెల 30వ తేదీ నుండి ప్రతి గ్రామంలోనూ వ్యవసాయ ఎటిఎంలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, అక్వాఫీడ్, మార్కెట్ సమాచారం, పంటల సాగు సమాచారం పొందుతారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా ఈ ఎటిఎంలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 10,641 గ్రామాల్లో ఈ డిజిటల్ కియోస్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ సచివాలయంలోనూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ప్రతి భరోసా కేంద్రంలోనూ ఎటిఎం లాంటి డిజిటల్ కియోస్క్ అందుబాటులో ఉంటుంది. రైతులు ఈ కియోస్క్‌ను సులభంగా ఉపయోగించవచ్చు. ఈ కియోస్క్‌లో టచ్ స్క్రీన్, ఫ్రంట్ కెమెరా, ఆధార్‌తో అనుసంధానమైన ఫింగర్ ప్రింట్ స్కానర్, మైక్రోఫోన్, స్పీకర్లు ఉంటాయి. కియోస్క్ ఎదుట రైతు నిలబడి వేలితో టచ్ స్క్రీన్‌ను తాకి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
వివిధ కంపెనీలకు సంబంధించిన పంటల విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, పశువుల దాణా వంటి వాటి ఉత్పత్తుల బమ్మలు, వాటి ధరవరలు కియోస్క్ మీద ప్రత్యక్ష మౌతాయి. రైతులు ఏం కొనాలో, ఎంత పరిమాణంలో కొనాలో ఒకటికి రెండు సార్లు చూసుకోని క్లిక్ చేస్తే ఆర్డర్ ప్రింట్ అయి వస్తుంది. ఆ ఆర్డర్ రెండు నుంచి మూడు రోజుల్లో మార్కెటింగ్ శాఖ అధికారులు రైతుల ఇళ్ల వద్దకు తెచ్చి ఇస్తారు. విత్తనాలను ఎపి సీడ్స్, మిగతావాటిని ఆగ్రోస్ సెంటర్లు సరఫరా చేస్తాయి.