Idream media
Idream media
రాష్ట్రంలో జిల్లా, మండల స్థాయిల్లో అగ్రికల్చర్ సలహా బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. పంటల ప్రణాళిక, ఈ-మార్కెటింగ్ ఫ్లాట్‌ఫాంపై క్యాంపు కార్యాలయంలో సిఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సిఎం జగన్ అధికారులకు కొన్ని మార్గదర్శకాలు చేశారు. ఈ-క్రాపింగ్ మీద సమగ్ర విధివిధానాలను, ఎస్‌ఓపిలను వెంటనే తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.ఆర్జీకే(రైతు భరోసా కేంద్రాలు)పరిధిలో ఏ పంటలు వేయాలన్నదానిపై మ్యాపింగ్ చేయాలన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని దాని పరిధిలో ఏయే పంటలు వేయాలన్నదానిపై పంటల ప్రణాళికను సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏయే రైతు ఏ పంట వేస్తున్నారన్నదానిపై ఈ- క్రాపింగ్ కోసం విధివిధానాలను మరింత సమగ్రంగా తయారు చేసి, వాటిని వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని సిఎం ఆదేశించారు. మార్కెటింగ్ చేయలేని పంటలు వేస్తే రైతులు నష్టపోతారన్నారు.
పంటల ప్రణాళికకు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలని జగన్ ఆదేశించారు. రైతులు పండించిన పంటలను విక్రయించేందుకు ఈ-ప్లాట్‌ఫాంను కూడా సిద్ధంచేయాలని సిఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వం 30 శాతం పంటలను కొనుగోలుచేయాలని నిశ్చయించిందని, మిగతా 70 శాతం పంట కూడా అమ్ముడయ్యేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలన్నారు. దీనికోసం ఈ- మార్కెటింగ్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామస్థాయిలో గ్రేడింగ్, ప్యాకింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని, ఈ- మార్కెటింగ్ పద్దతిలో పంటను అమ్మాలంటే నాణ్యత అనేది చాలా ముఖ్యమని జగన్ పేర్కొన్నారు. గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్ లాంటి ప్రయత్నాలు చేయకపోతే నాణ్యతాప్రమాణాలను పాటించలేమని, ఈ ఖరీఫ్ పంట చేతికి వచ్చే సమయానికి గ్రేడింగ్, ప్యాకింగ్ అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. ఈ-మార్కెటింగ్ ఫ్లాట్‌పాం విజయవంతం కావాలంటే సరైన రవాణా సదుపాయాలు, సకాలంలో రైతులకు చెల్లింపులు, వ్యవసాయ ఉత్పత్తుల్లో నాణ్యత పాటించడం అనే మూడు అంశాలు అత్యంత కీలకమని సిఎం జగన్ అన్నారు. ఈ మూడు అంశాలపై సమర్థవంతమైన ఆలోచనలు చేయాలని సీఎం ఆదేశించారు.
ముందుగా ప్రతి ఆర్బీకే పరిధిలో గ్రేడింగ్, ప్యాకింగ్ సుదుపాయాలు కల్పించాలని, ఈ ఖరీఫ్ పంట చేతికి వచ్చేనాటికి గ్రేడింగ్, ప్యాకింగ్ సిద్ధంకావాలని సిఎం అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. 10,641 ఆర్బీకేలలో గ్రేడింగ్, ప్యాకింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయాలని సిఎం జగన్ ఆదేశించారు. వచ్చే కాలంలో ఏర్పాటు చేయబోయే జనతా బజార్లకూ ఈ విధానాలు దోహదపడతాయని సిఎం అన్నారు. గ్రేడింగ్, ప్యాకింగ్ తర్వాత గ్రామాల్లో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలపై దృష్టిపెట్టాలని సిఎం అన్నారు. గోడౌన్స్, కోల్డు స్టోరేజీలకు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు కావాలన్నారు. వీటికి అవసరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. మార్గదర్శక ప్రణాళిక రూపొందించి తనకు నివేదించాలని సిఎం అధికారులను ఆదేశించారు. క్యాంపు క్యారాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.