iDreamPost
android-app
ios-app

రాత్రి 7గంటల తర్వాత ఏపీలో ప్రవేశం నిషిద్ధం

  • Published Jun 29, 2020 | 2:31 AM Updated Updated Jun 29, 2020 | 2:31 AM
రాత్రి 7గంటల తర్వాత ఏపీలో ప్రవేశం నిషిద్ధం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కట్టుదిట్టమైన చర్యలకు పూనుకుంటోంది. కరోనా నియంత్రణలో భాగంగా ఇప్పటికే కీలక నిర్ణయాలతో స్థానికులకు ఉపశమనం కలిగిస్తోంది. ఉదాహరణకు దేశమంతా కొన్ని రైళ్ల రాకపోకలకు అనుమతిచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మాత్రం ఎక్కువ స్టేషన్లలో ప్రవేశాలకు ససేమీరా అని చెప్పింది. కేంద్ర రైల్వో బోర్డ్ తో మాట్లాడి కేవలం ప్రధాన నగరాల్లో మాత్రమే రైళ్లు ఎక్కేందుకు, దిగేందుకు అనుమతినిచ్చింది. దాని కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారిని పూర్తిగా పరీక్షించేందుకు, అవసరమైన వారిని క్వారంటైన్ కి తరలించేందుకు అవకాశం ఉంటుందని అప్పట్లో స్పష్టం చేసింది. ఆచరించింది. అందుకు తగ్గట్టుగా ఫలితాలు సాధించింది. దానికి భిన్నంగా వ్యవహరించిన తెలంగాణా సహా వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం పరిస్థితులు అందరికీ అర్థమవుతున్నాయి.

అదే విధంగా ఏపీ నుంచి తెలంగాణా కి రోడ్డు మార్గంలో వెళ్లే వాహనాలకు అభ్యంతరాలు లేవు. అదే సమయంలో హైదరాబాద్ సహా వివిధ రాష్ట్రాల నుంచి ఏపీలోకి వాహనాలు రావాలంటే దానికి పలు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా స్పందన సహా వివిధ పోర్టళ్లలో దరఖాస్తు చేసుకుని, అత్యవసర సేవలకు అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు. దానికి తగ్గట్టుగా సరిహద్దు రాష్ట్రాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్కడే పరీక్షలు నిర్వహించే ప్రక్రియ సాగిస్తున్నారు. దాని కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్యను నియంత్రణలో ఉంచేందుకు అవకాశం దక్కిందని అధికార యంత్రాంగం చెబుతోంది.

ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుని ఏపీ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించే దిశలో సాగుతోంది. ఇప్పటికే సమీప తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దాంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వారిని నియంత్రించేందుకు అనుగుణంగా రాత్రి 7 గంటల తర్వాత ఏపీలో అడుగుపెట్టనివ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు.

రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకూ సరిహద్దులు మూసివేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా స్పందనలో అనుమతి తీసుకున్న వారికి సమాచారం అందించారు. రాత్రి వేళ కొందరు అనుమతులు లేకుండా ఏపీలో అడుగుపెడుతూ క్వారంటైన్ నిబంధనలు బేఖాతరు చేస్తున్న తరుణంలో ఇది కీలక నిర్ణయం కాబోతోంది. 14 రోజుల క్వారంటైన్ నిబంధనలు పాటించేందుకు అనుమతించిన తర్వాతే వారిని నియమిత కాలంలో ఏపీలో అడుగుపెట్టేలా ఆదేశాలు రావడంతో యంత్రాంగం దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల వాసులు ఏపీలో రావాలనుకుంటే సమయపాలన చాలా అవసరంగా కనిపిస్తోంది.