iDreamPost
android-app
ios-app

కళాజీవుల అద్భుత సంగమం – Nostalgia

  • Published Jun 03, 2020 | 1:06 PM Updated Updated Jun 03, 2020 | 1:06 PM
కళాజీవుల అద్భుత సంగమం – Nostalgia

కమర్షియల్ సినిమా రాజ్యమేలుతున్న టైంలో ఆ ట్రెండ్ కు ఎదురీది సంగీత సాహిత్యాలకు పెద్ద పీట వేసి శంకరాభరణం లాంటి మాస్టర్ పీస్ తో ఇతర రాష్ట్రాలలోనూ జయకేతనం ఎగరవేసిన కళాతపస్వి కె విశ్వనాథ్ గారి మరో అపూర్వ సృష్టి ‘సాగరసంగమం’. 1983లో సరిగ్గా ఇదే తేది జూన్ 3న విడుదలైన ఈ కళాఖండం ఇప్పటికీ తన పరిమళాలను వెదజల్లుతూనే ఉంది. ఇళయరాజా సంగీతం ఎప్పుడు విన్నా ఒళ్ళు పరవశంతో చిందులు తొక్కుతుంది. పాటలు ఏ కాలంలో అయినా వేటూరి సాహిత్య సౌరభాలను పంచుతునే ఉంటాయి. తొలుత ఈ సినిమా కథ విన్నప్పుడు కమల్ ముసలివాడి వేషం ఎంత వరకు వర్కవుట్ అవుతుందనే అనుమానం వెలిబుచ్చారు. కారణం అదే టైంలో వయసుమళ్ళిన వాడిగా చేసిన ఓ తమిళ మూవీ డిజాస్టర్ కావడమే.

కాని విశ్వనాథ్ గారి మీద నమ్మకం ఇంకో ఆలోచన చేయనివ్వలేదు. కథలో బాలు తనే అని ఫిక్స్ అయ్యాడు. ముందు హీరొయిన్ గా జయసుధను అనుకున్నా కాల్ షీట్స్ సమస్య వల్ల ఆ అదృష్టం జయప్రదను వరించింది. ఎలాంటి విఘ్నాలు లేకుండా షూటింగ్ పూర్తయ్యింది. తకిటతకిట తధిమి పాటను చెన్నై అరుణాచలం స్టూడియోలో ప్రత్యేకంగా సెట్ వేసి చిత్రీకరించారు. చూస్తున్నంత సేపు కమల్ ఎక్కడ నూతిలో పడిపోతాడో అని భయపడేలా నభూతో నభవిష్యత్ అనే రీతిలో విశ్వనాథ్ గారు షూట్ చేశారు. జయప్రద కూతురి పాత్రలో గాయని ఎస్పి శైలజ ఎలాంటి బెరుకు లేకుండా నటించేశారు. అలా సుమారు 30 లక్షల బడ్జెట్ లో సినిమా పూర్తయ్యింది. 7 పాటలు జనాల్లోకి వెళ్ళిపోయాయి. పరవశంతో మళ్ళీ మళ్ళీ వినసాగారు. ఇళయరాజాకు మొదటిసారి జాతీయ అవార్డు వచ్చేలా చేసింది సాగర సంగమమే.

ప్రతి సన్నివేశం ఎంతో హృద్యంగా సాగడంతో మొదటి వారం తర్వాత సాగర సంగమం థియేటర్లకు జనం పోటెత్తడం ప్రారంభమయ్యింది. 18 కేంద్రాల్లో దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. తమిళ వెర్షన్ సైతం 7 సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ పూర్తి చేసుకోవడం విశేషం. కుదించిన ఆటలతో బెంగుళూరు నగరంలోని పల్లవి థియేటర్లో ఏకంగా 511 రోజులు ప్రదర్శింపబడటం ఇప్పటికీ రికార్డుగా నిలిచిపోయింది. కమల్, జయప్రద, శరత్ బాబు, ఎస్పి శైలజ, సాక్షి రంగారావు, డబ్బింగ్ జానకి, పొట్టి ప్రసాద్, ధం ప్రతిఒక్కరు ఈ మహాకావ్యంలో తమ వంతు పాత్రను గొప్పగా నిర్వర్తించారు. ముఖ్యంగా కమల్ వయసులో ఉన్నప్పుడు, ముసలివాడు అయ్యాక రెండు షేడ్స్ ని ప్రదర్శించిన తీరుకి కళ్ళు చెమర్చని వారు లేరు. ఎన్ని పురస్కారాలు లభించాయో లెక్క బెట్టడం కష్టం. అందుకే కాలంతో సంబంధం లేకుండా ప్రతి సన్నివేశం జీవిత పాఠంలా అనిపించే సాగర సంగమం ప్రతి ఒక్క దర్శకుడు, సినిమా ప్రేమికులు చూడాల్సిన చదవాల్సిన అత్యున్నత గ్రంథం.