దేశవ్యాప్తంగా 75 జిల్లాలు లాక్ డౌన్

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధించడంలో భాగంగా ప్రధాని పిలుపు మేరకు 14 గంటల జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది.దేశవ్యాప్తంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమై జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. భారత్‌లో కోవిడ్-19 చాప కింద నీరులా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈరోజు వివిధ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కేంద్ర క్యాబినెట్ సెక్రెటరీ,హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.కరోనా వైరస్ సోకిన పాజిటివ్ కేసుల సంఖ్య 370 కి చేరుకోవడంతో పాటు,ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకూ ఏడుగురు మరణించారు.ఈ విపత్కర పరిస్థితులలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 75 జిల్లాలను మార్చి 31 వరకు లాక్‌డౌన్ చెయ్యాలని నిర్ణయించారు.

కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ జిల్లాల లిస్టులో తెలంగాణకు చెందిన ఐదు జిల్లాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి,సంగారెడ్డి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను మూసివేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. మరో తెలుగు రాష్ట్రం ఏపీలో కూడా ప్రకాశం,కృష్ణా (విజయవాడ),విశాఖపట్నం జిల్లాలలో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్నింటినీ మూసి ఉంచాలని కోరింది.ఈ ఉత్తర్వులు మార్చి 31 వరకు అమలులో ఉంటాయని కేంద్రం ప్రకటించింది.

రైల్వేశాఖ దేశవ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు గూడ్స్ మినహా మిగతా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది.దేశవ్యాప్తంగా మార్చి 31 వరకూ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేయాలని రాష్ట్రాలను హోంమంత్రిత్వశాఖ ఆదేశించింది.అలాగే మెట్రో రైళ్ల రద్దుపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

Show comments