iDreamPost
android-app
ios-app

నందమూరి నవరస నాయకా @ 60

  • Published Jun 10, 2020 | 8:22 AM Updated Updated Jun 10, 2020 | 8:22 AM
నందమూరి నవరస నాయకా @ 60

300పైగా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని సుస్థిర స్థానం సంపాదించుకున్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ వెండితెర వారసత్వాన్ని భుజాలపై మోయడమంటే మాటలు కాదు…..

కోట్లాది అభిమానుల అంచనాలు అందుకుంటూ వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఉంటూనే తనకంటూ ప్రత్యేకమైన ముద్ర సంపాదించుకోవడం సులువు కాదు…..

క్లాసు మాసు తేడా లేకుండా అన్ని వర్గాల వీక్షకులను నటనా మాయాజాలంతో మురిపించి దశాబ్దాలకు పైగా స్టార్ గా తన స్థానాన్ని సుస్థిరపరుచుకోవడం అందరివల్లా కాదు…..

తండ్రికున్న పదమూడు సంతానంలో యాక్టింగ్ లెగసీని తానొక్కడే మోయాల్సి వచ్చినా దాన్ని బరువనుకోకుండా బాధ్యతగా తీసుకుని ఎప్పటికప్పుడు ప్రయోగాలతో మెప్పించడం అంత సులభం కాదు…..

ఇవన్ని సాధ్యం చేసి చూపించారు అభిమానులు ప్రేమతో బాలయ్య అని పిలుచుకునే నందమూరి బాలకృష్ణ…..

14 ఏళ్ళ లేలేత ప్రాయంలో నాన్న స్వీయ దర్శకత్వంలో ఆయనతోనే తాతమ్మ కలలో నటించాల్సి వచ్చినప్పుడు బెదరలేదు. ఆ తర్వాత వరసగా 10 సినిమాలు కేవలం నటన నేర్చుకోవడానికి, తండ్రి దగ్గర వివిధ శాఖలకు సంబంధించి మెలకువలు తెలుసుకోవడానికి వాడినప్పుడు బెదరలేదు. రాబోయే కొండంత బరువును తలుచుకుని భయపడలేదు. రాటు దేలాడు. తనను తాను అసలు సిసలు కథానాయకుడిగా మలుచుకున్నాడు. నాన్న ఇచ్చిన ఆస్తిపాస్తుల కంటే విలువైన అభిమాన సంపదను కాచుకోవాలనే లక్ష్యాన్ని గుర్తెరిగి దానికి అనుగుణంగానే కెరీర్ ని నిర్దేశించుకోవాలని కంకణం కట్టుకున్నాడు

సోలో హీరోగా మొదటి సినిమా సాహసమే జీవితం ఫ్లాప్. ఆ తర్వాత డిస్కో కింగ్, జననీ జన్మభూమిలతో హ్యాట్రిక్ పూర్తయ్యింది. నిరాశపడలేదు. బాలయ్యను ఎలా చూపిస్తే జనం నెత్తినబెట్టుకుంటారో తెలిసిన దర్శకుడు కోడి రామకృష్ణ, నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి తోడయ్యారు. ఫలితం మంగమ్మ గారి మనవడు లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్. వంద రోజులు అనుకుంటే ఏకంగా ఏడాది ఆడింది. ఆపై పల్నాటి పులి నిరాపరిచినా ఆ తర్వాత నాన్నతో చేసిన శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సృష్టించింది. ఆపై జయాపజయాలు ఒకే నిష్పత్తిలో బాలయ్యను పలకరిస్తూ వెళ్లాయి. 26వ సినిమా ముద్దుల కృష్ణయ్యతో తనలోని మాస్ హీరో విశ్వరూపాన్ని ఆవిష్కరించారు కోడిరామకృష్ణ. పల్లెటూరి నేపథ్యంలో రూపొందే చిత్రాలకు బాలయ్య తిరుగులేని వేల్పుగా మారిపోయారు. సీతారామ కల్యాణం, దేశోద్ధారకుడు, భార్గవరాముడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి ఇలా జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. మువ్వగోపాలుడుతో మరోసారి రికార్డులు బద్దలయ్యాయి.

1989లో తన 46వ సినిమా ముద్దుల మావయ్య రూపంలో సెంటిమెంట్ సినిమాతోనూ వసూళ్ల వర్షం కురిపించవచ్చని నిరూపించారు బాలయ్య. తనకు అచ్చివచ్చిన కోడి, గోపాల్ రెడ్డి మరోసారి అండగా నిలబడ్డారు. అత్తాఅల్లుళ్ళ కామెడీని ఆధారంగా చేసుకుని రూపొందిన నారి నారి నడుమ మురారి మరో అందమైన జ్ఞాపకం. ఇళయరాజా, రాజ్ కోటి ప్రభంజనంలో మామ మహదేవన్ పనైపోయిందని అందరూ అనుకుంటున్న తరుణంలో ఆయన ద్వారా ఏకంగా 4 మ్యూజికల్ హిట్స్ అందుకోవడం బాలయ్య సాహసానికి నిదర్శనం. అందులో లారీ డ్రైవర్ లాంటి మాస్ మసాలా బొమ్మ కూడా ఉంది. 1992లో రౌడి ఇన్స్ పెక్టర్ ద్వారా తన హీరోయిజంలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు డైరెక్టర్ బి గోపాల్. అప్పుడూ వసూళ్ల సునామీనే. సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369, జానపద ఆణిముత్యం భైరవద్వీపం ఈ రెండూ ఎవర్ గ్రీన్ క్లాస్సిక్స్. 1993లో బొబ్బిలి సింహం ద్వారా గ్రామీణ కథల్లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించారు బాలయ్య.

1999లో సీమ ఫ్యాక్షన్ ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన సమరసింహారెడ్డి తెలుగు సినీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెరతీసింది. కోట్ల రూపాయల వసూళ్లు వరదలా వచ్చి పడ్డాయి. పాత రికార్డులకు ఉప్పు పాతరేస్తూ ఏకంగా 73 కేంద్రాల్లో వంద రోజులు, 31 సెంటర్లలో 175 రోజులు ప్రదర్శింపబడి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత తిరిగి నరసింహనాయుడుతో తానే వాటిని చెరిపేశారు బాలయ్య. ఇప్పటికీ అభిమానులు కాలరెగరేసి మరీ గర్వంగా చెప్పుకునే సినిమాలివి. ఆ తర్వాత కొన్ని ఎదురు దెబ్బలు. మధ్యలో చెన్నకేశవరెడ్డి, లక్ష్మి నరసింహ ఊరట కలిగించినా సింహా వచ్చే ముందు వరకు ఆయన స్థాయి సినిమాలేవి రాలేదన్నది వాస్తవం. బోయపాటి శీను మళ్ళీ రెండో సారి లెజెండ్ కోసం టై అప్ అయ్యి ఇంకోసారి రికార్డులు షేక్ చేశారు. 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక పురుషుడి సినిమా చేయడం అందరూ హర్షించిన చిత్రరాజం. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో అంచనా తప్పినా నాన్నకు తాను కోరుకున్న నివాళి ఇచ్చేశారు బాలయ్య.

కథల ఎంపికలో తడబాటు వల్ల లేదా మొహమాటం వల్ల బాలకృష్ణ చాలా సార్లు ఎదురు దెబ్బలు తిన్నారు. కొందరు దర్శకులను గుడ్డిగా నమ్మి ఇలాంటి సినిమా బాలయ్య ఎలా ఒప్పుకున్నాడు అనిపించేలా నిరాశపరిచాడు. అయినా పులి రెండు అడుగులు వెనక్కు వేసేది ముందు దూకేందుకే అనే నానుడిని నిజం చేస్తూ ఇలా జరిగిన ప్రతిసారి భారీ బ్లాక్ బస్టర్ తో బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యారు బాలయ్య. అందుకే ఇప్పటికీ 60 ఏళ్ళ వయసులోనూ తెల్లని పంచెకట్టు శత్రువు ఒళ్ళు జలదరించేలా కళ్ళతోనే రౌద్రం పలికించడం, గొంతులోనే శత్రువు శరీరంలో వణుకు పుట్టించడం ఆయనకే చెల్లింది. అందుకే వందేళ్ళు వచ్చినా బాలకృష్ణలోనే ఈ ఎనర్జీనే ఆయనకు రక్షగా నిలబడి అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.