Idream media
Idream media
శాసన మండలి ఎన్నికల వేళ బీహార్‌లో ఆర్జేడీకి భారీ ఎదురుదెబ్బ
బీహార్‌లో శాసన మండలి ఎన్నికలకు ముందు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు సిఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని అధికార జనతాదళ్ యునైటెడ్(జెడియు)లో చేరారు. దీంతో ఎనిమిది మంది ఎమ్మెల్సీలున్న ఆర్జేడీ బలం మూడుకు పడిపోయింది. ఆర్జేడీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ నాయకుడు రఘవాన్ష్ ప్రసాద్ సింగ్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.
జూలై 6న బీహార్‌లో తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అందుకు ఇప్పటికే అధికార జెడియు, బిజెపిలు ఎన్నికల ప్రచారం మొదలెట్టాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జెడియు తరపున ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
ఎనిమిది ఎమ్మెల్సీలను ఉన్న ఆర్జేడీకి ఇప్పుడు కేవలం మూడు ఎమ్మెల్సీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అధికార జెడియుకు ఫిరాయించిన ఎమ్మెల్సీలు రాధా చరణ్ షా (2015), సంజయ్ ప్రసాద్ (2015), దిలీప్ రాయ్ (2015), ఎండి కమర్ ఆలం (2016), రణ విజయ్ కుమార్ సింగ్ (2016) ఉన్నారు.
జెడియులో చేరిన ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకు రారు. వారికి ఆ చట్టం చిక్కులు కూడా ఎదరవ్వవు. ఎందుకంటే ఆర్జేడీకి చెందిన మొత్తం ఎమ్మెల్సీలలో మూడింట రెండు వంతుల మంది జెడియులో చేరారు. ఆర్జేడీ ఎమ్మెల్సీలను అధికారికంగా చేరడం గురించి ఒక లేఖను జెడియు చీఫ్ విప్ రీనా దేవి శాసన మండలి యాక్టింగ్ చైర్మన్‌కు పంపారు.
దీంతో 75 మంది సభ్యుల బీహార్ శాసన మండలిలో 21 ఎమ్మెల్సీలతో జెడియు అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుతం 29 స్థానాలు ఖాళీగా ఉన్నందున శాసన మండలిలో 46 మంది ఎమ్మెల్సీలుగా ఉన్నారు. కౌన్సిల్‌లో బిజెపికి 16 ఎమ్మెల్సీలు ఉన్నారు. స్వతంత్ర ఎమ్మెల్సీల మద్దతు కూడా బిజెపికే ఉంది. తొమ్మిది సీట్ల భర్తీకి ఎన్నికల పోలింగ్ జూలై 6న నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది.
ఆర్జేడీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలోనూ, మహా కూటమిలోని చిన్న పార్టీల నుండి అల్టిమేటం అందుకున్న సమయంలోనూ ఈ రాజకీయ పరిణామాలు ఆర్జేడీకి మరింత నష్టాన్ని చేకుర్చాయి. కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా తేజ్ ప్రతాప్ యాదవ్‌కు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ రాఘోపూర్ భోలారాయ్‌కు చెందిన మాజీ ఆర్జేడీ ఎమ్మెల్యే, ఆయన మద్దతుదారులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి రాబ్రీ దేవి ఇంటి వెలుపల ఆందోళన చేపట్టారు. తేజ్ ప్రతాప్ ప్రస్తుతం మహువాకు చెందిన ఎమ్మెల్యే అని, కనుక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాఘోపూర్ నుంచి తేజశ్వి యాదవ్ ఎన్నికయ్యే అవకాశాలను దెబ్బతీస్తామని నిరసనకారులు పేర్కొన్నారు.
ఆర్జేడీలో నాయకులు, కార్యకర్తలు “ఆయన నాయకత్వంతో సంతోషంగా లేరు” కాబట్టి రాబోయే నెలల్లో ఎక్కువ మంది ఆర్జేడీని విడిచిపెడతారని జెడియు వర్గాలు తెలిపాయి. అంతకుముందు జూన్ 16 న మాజీ జెడియు ఎమ్మెల్సీ జావేద్ ఇక్బాల్ అన్సారీ ఆర్జేడీలో చేరారు.
మాజీ ముఖ్యమంత్రి జితాన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందూస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) జూన్ 25 లోగా సంకీర్ణ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని అల్టిమేటం జారీ చేయడంతో బీహార్‌లో మహా కూటమిలో గొడవలు ముమ్మరం అయ్యాయి. చిన్న మిత్ర పార్టీలతో సీట్లపై చర్చలను ప్రారంభించడానికి సీనియర్ మిత్రుడు ఆర్జేడీపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో ఇలా అల్టిమేట్ జారీ చేశారు. హెచ్ఎఎం-ఎస్ ప్రస్తుత పరిస్థితులను చర్చించాల్సి వస్తే, జెడియులో తిరిగి చేరాలని మాంఝీ ఆలోచిస్తున్నాడు.